జెండా ఎగరేస్తే అరెస్టు చేస్తారా? ఢిల్లీలో అభిజీత్ దిప్కే తిరంగా పిలుపు.!
భారత జాతీయ జెండాను ఎగురవేయడం నేరం కాదని నిరూపించేందుకు దేశవ్యాప్తంగా నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే జాతీయ జెండాను అమితంగా
Abhijeet Dipke
భారత జాతీయ జెండాను ఎగురవేయడం నేరం కాదని నిరూపించేందుకు దేశవ్యాప్తంగా నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే జాతీయ జెండాను అమితంగా ప్రేమించే ప్రతి ఒక్కరూ అక్టోబరు 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్ వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చి జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రముఖ యూట్యూబర్, కార్యకర్త అభిజీత్ దిప్కే పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఒక వీడియో సందేశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
జెండా ఎగురవేస్తే జైలుపాలు చేస్తారా?
ఈ వీడియోలో అభిజీత్ దిప్కే మాట్లాడుతూ.. కేవలం జాతీయ జెండాను చేతబూని ప్రదర్శించినందుకు సౌరభ్ , అశు అనే వ్యక్తులను పోలీసులు అన్యాయంగా జైలులో పెట్టారని ఆరోపించారు. జెండాను పట్టుకోవడం, ప్రదర్శించడం ఎప్పటికీ నేరం కాదని చాటిచెప్పేందుకే ఈ శాంతియుత నిరసన కార్యక్రమాన్ని తలపెట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీకి నేరుగా రాలేని దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా అదే రోజు, అదే సమయానికి తమ సొంత నగరాల్లో ప్రత్యేకంగా తిరంగా ర్యాలీలు నిర్వహించి తమ నిరసనను తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అరెస్టు చేసినా వెనకడుగు వేయను: అభిజీత్ దిప్కే
మన జాతీయ జెండా కేవలం ఒక వస్త్రం కాదని, అది కోట్లాది మంది భారతీయుల ఆత్మగౌరవానికి, దేశ గర్వానికి ప్రతీక అని అభిజీత్ దిప్కే ఉద్ఘాటించారు. ఒకవేళ ఈ కార్యక్రమం కారణంగా తనను పోలీసులు అరెస్టు చేసినా సరే, తాను జాతీయ జెండాను ఎగురవేయడాన్ని ఏమాత్రం ఆపబోనని తేల్చిచెప్పేశారు. "నా తిరంగా నా ప్రాణాలతో సమానం.. నా గర్వం.. దీన్ని ఎగరవేయడాన్ని ఎప్పటికీ ఆపను" అంటూ ఆయన ధైర్యంగా ప్రకటించారు. ఢిల్లీ వేదికగా జరగనున్న ఈ తిరంగా ఆందోళనకు ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.




