Abhishek Banerjee: అభిషేక్‌పై దాడి చేయడానికి టైమ్ ఎవరికి ఉంది?.. బీజేపీ సెటైరికల్ కౌంటర్!
Abhishek Banerjee: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ రచ్చ మరోసారి తారాస్థాయికి చేరింది! తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పుట్టినరోజు వేడుకలు ఏకంగా అర్ధరాత్రి పూట హైడ్రామాకు వేదికగా మారాయి.
Abhishek Banerjee: అభిషేక్‌పై దాడి చేయడానికి టైమ్ ఎవరికి ఉంది?.. బీజేపీ సెటైరికల్ కౌంటర్!
Abhishek Banerjee: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ రచ్చ మరోసారి తారాస్థాయికి చేరింది! తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పుట్టినరోజు వేడుకలు ఏకంగా అర్ధరాత్రి పూట హైడ్రామాకు వేదికగా మారాయి. తన పుట్టినరోజు సందర్భంగా తన ఇంటిపై బీజేపీ గూండాలు దాడి చేశారంటూ అభిషేక్ బెనర్జీ చేసిన తీవ్ర ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే, ఈ ఆరోపణలను బీజేపీ నేతలు అంతే గట్టిగా తిప్పికొట్టారు. "అసలు అభిషేక్ బెనర్జీపై దాడి చేయడానికి ఎవరికి తీరిక ఉంటుంది? రోడ్డు మీద పుట్టినరోజులు చేసుకుంటూ జనాలను నంసారం చేయడం వీళ్లకు అలవాటే!" అంటూ సెటైర్లు పేల్చారు.
అర్ధరాత్రి రెండు గంటలకు కాళీఘాట్ వద్ద రగడ
కోల్‌కతాలోని కాళీఘాట్‌లో ఉన్న అభిషేక్ బెనర్జీ నివాసం వద్ద తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది. పుట్టినరోజు వేడుకల హడావుడిలో ఉన్న టీఎంసీ శ్రేణులకు, కొందరికి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో పరిస్థితి చేయి దాటింది. తన మద్దతుదారులపై ప్రత్యర్థులు రాళ్లు, ఇటుకలతో దాడి చేశారని, గత ఆరు నెలల్లో తనను చంపడానికి ఇది ఏడో ప్రయత్నమంటూ అభిషేక్ బెనర్జీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన పోస్టర్లు, బ్యానర్లను చించివేస్తూ భయానక వాతావరణం సృష్టించారని, రాష్ట్రంలో పోలీసులు, న్యాయవ్యవస్థ కూడా మూగ ప్రేక్షకులుగా మారిపోయాయంటూ ఆయన మండిపడ్డారు.
ఎవరికి టైమ్ ఉంటుంది బాసూ?.. బీజేపీ ఎద్దేవా
అభిషేక్ బెనర్జీ చేసిన ఈ సంచలన ఆరోపణలపై బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఫుట్‌పాత్‌లపై పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎక్కడైనా చూశామా అంటూ ఎద్దేవా చేశారు. అర్ధరాత్రి పూట ఎక్కడో ఎవరో చిన్న గొడవ చేస్తే, దాన్ని కూడా తమ పార్టీకి ఆపాదించడం ఏంటని ప్రశ్నించారు. "అసలు అభిషేక్ బెనర్జీ మీద దాడి చేయడానికి ఎవరికి సమయం ఉంటుంది? ఇంకేం పనిపాట లేక ఆయనపై పడతామా?" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజాదరణ కోల్పోతున్న తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి, కేవలం సింపథీ కోసం ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.
పోలీసుల నిఘాపై కొత్త అనుమానాలు
మరోవైపు తన కార్యాలయం, నివాసంపై గత రెండు రోజులుగా గుర్తుతెలియని వ్యక్తులు, పోలీసులు నిఘా పెట్టారంటూ అభిషేక్ బెనర్జీ లేవనెత్తిన అంశం కలకలం రేపుతోంది. ఒక ఎంపీ ఇంటిపై రాష్ట్ర పోలీసులే గూఢచర్యం చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ మొత్తం ఉదంతంపై లోక్‌సభ స్పీకర్‌తో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. పుట్టినరోజు వేడుకలతో ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధానికి దారి తీసింది.




