Dhanush: విజయ్ దారిలోనే ధనుష్ బిగ్ స్కెచ్.. 234 నియోజకవర్గాల్లో ఉచిత ఏసీ ట్యూషన్ సెంటర్లు!
Dhanush: తమిళ నటుడు ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన ప్రచారం. 234 నియోజకవర్గాల్లో ఉచిత ఏసీ ట్యూషన్ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం.
Dhanush: విజయ్ దారిలోనే ధనుష్ బిగ్ స్కెచ్.. 234 నియోజకవర్గాల్లో ఉచిత ఏసీ ట్యూషన్ సెంటర్లు!
Dhanush: ప్రముఖ నటుడు ధనుష్ రాజకీయ ప్రవేశంపై జోరుగా సాగుతున్న ఊహాగానాలు ఇప్పుడు మరింత బలపడ్డాయి. ఇప్పటికే అభిమాన సంఘాల ద్వారా పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టిన ఆయన, తాజాగా తన సేవా పరిధిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తూ తీసుకున్న సంచలన నిర్ణయం తమిళ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తన 'ధనుష్ నార్పని ఇయక్కం' (ధనుష్ సంక్షేమ ఉద్యమం) సంస్థ ద్వారా తమిళనాడులోని పేద విద్యార్థుల కోసం ఉచితంగా ఏసీ (A/C) ట్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ధనుష్ శ్రీకారం చుట్టారు. 2027 జనవరి నుంచి ఈ బృహత్తర పథకాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తొలి దశలోనే తమిళనాడులోని అన్ని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10వ, 12వ తరగతి విద్యార్థుల కోసం 'స్మార్ట్ స్టడీ హబ్స్' పేరిట ఉచిత ఏసీ ట్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి సెంటర్లో ముగ్గురు ఉపాధ్యాయులు, ఒక సహాయకుడిని నియమించనుండగా.. వారి పూర్తి జీతభత్యాలను ధనుష్ సేవా సంస్థయే భరించనుంది.
ధనుష్ ఇప్పటికే ‘తమిళగ ఎళుచ్చి కళగం’ అనే పేరుతో రాజకీయ పార్టీని నమోదు చేయించారనే ప్రచారం తమిళనాడులో గట్టిగా జరుగుతోంది. ఇటీవల చెన్నైలో సుమారు 3,000 మంది మహిళా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా కేంద్రాల ఏర్పాటుకు ప్రకటన చేయడం ద్వారా ఆయన పొలిటికల్ ఎంట్రీకి బలమైన పునాది వేసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, తన రాజకీయ ప్రవేశంపై ధనుష్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, విజయ్ తరహాలోనే ధనుష్ కూడా ఎన్నికల ముంగిట ప్రత్యక్ష రాజకీయంలోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.




