CM Vijay: ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో తానే.. డీఎంకేపై సీఎం విజయ్ ఫైర్!
CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ అసెంబ్లీ వేదికగా డీఎంకే తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో తానేనని స్పష్టం చేశారు.
CM Vijay: ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో తానే.. డీఎంకేపై సీఎం విజయ్ ఫైర్!
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష డీఎంకే పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ డిమాండ్లపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, అవినీతి రహిత పాలన అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మహిళల భద్రత విషయంలో తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని ఆయన తేల్చి చెప్పారు.
గత డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నాడీఎంకే ప్రవేశపెట్టిన ఎన్నో అద్భుతమైన ప్రజా సంక్షేమ పథకాలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిందని విజయ్ ఆరోపించారు. అమ్మ మినీ క్లినిక్‌లు, తాలికి తంగం పథకం, అమ్మ టూ వీలర్స్, ఉచితంగా ఆవులు, మేకల పంపిణీ లాంటి ఎన్నో పథకాలను వారు ఆపేశారని ఆయన గుర్తుచేశారు. విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇవ్వకుండా నాలుగేళ్ల పాటు కాలయాపన చేశారని, జయలలిత యూనివర్సిటీని కూడా మూసివేశారని ఆయన మండిపడ్డారు. ప్రజా సంక్షేమం కోసం వెచ్చించాల్సిన రూ. కోట్లు నిధులను వారు పక్కదారి పట్టించారని పరోక్షంగా విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన ఈ తప్పులను ప్రజలు గుర్తుపెట్టుకున్నారు కాబట్టే ఇటీవల జరిగిన ఎన్నికల్లో డీఎంకేకు గట్టి బుద్ధి చెప్పారని విజయ్ అన్నారు. రాజకీయాల్లో ఎంజీఆర్, ఎన్టీఆర్ లాంటి దిగ్గజ నాయకుల తర్వాత ప్రజలు ఆ స్థాయిలో ఆదరించిన నాయకుడు విజయ్ మాత్రమే అని ఆయన సగర్వంగా ప్రకటించారు. భగవంతుడు, ప్రకృతి ఎల్లప్పుడూ తమ వెంటే ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పోలీస్ వ్యవస్థలో గత ప్రభుత్వ జోక్యంపై కూడా విజయ్ తీవ్ర విమర్శలు చేశారు. డీఎంకే హయాంలో ఆ పార్టీ నాయకులపై కేసులు నమోదైనప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారని ఆయన ఆరోపించారు. విరుగంబాక్కంలో 2022లో జరిగిన డీఎంకే సభలో ఒక మహిళా పోలీస్ అధికారినే వేధించారని, ఆ కేసులో ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. డీఎంకే ఎంపీ రమేష్‌కు సంబంధించిన ఫ్యాక్టరీలో జరిగిన ఒక కార్మికుడి మరణాన్ని ఆత్మహత్యగా చిత్రించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. కానీ తమ టీవీకే ప్రభుత్వం మాత్రం తప్పు చేసిన వారు అధికార పార్టీ నేతలైనా సరే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయాల్లో మహిళలను కించపరిచేలా మాట్లాడే నాయకులకు విజయ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో మహిళల పట్ల ద్వంద్వార్థాలు వచ్చేలా అసభ్యకరంగా మాట్లాడటం ఏమాత్రం సరికాదని ఆయన హితవు పలికారు. గతంలో ఇదే అసెంబ్లీలో ప్రతిపక్షాల చేతిలో జయలలిత ఎదుర్కొన్న అవమానాలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. మహిళలు తమ ఇళ్లలోని ఆడపడుచులతో సమానం అన్న విషయం నాయకులు మర్చిపోకూడదని ఆయన సూచించారు. తాను రాజకీయాల్లో ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మహిళల మద్దతే ప్రధాన కారణమని విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. మహిళలపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ముఖ్యమంత్రి విజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.




