Air India: ఎయిరిండియా సంచలన నిర్ణయం.. జూన్ 1 నుంచి 90 రోజుల పాటు విమాన సర్వీసుల్లో భారీ కోత!

Air India: అంతర్జాతీయంగా విమాన ఇంధనం (ATF) ధరలు భారీగా పెరగడంతో ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 27 May 2026 3:39 PM IST
Air India
X

Air India: ఎయిరిండియా సంచలన నిర్ణయం: జూన్ 1 నుంచి 90 రోజుల పాటు విమాన సర్వీసుల్లో భారీ కోత!

Air India: అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, సంక్షోభ పరిస్థితుల కారణంగా ముడిచమురు ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ గ్లోబల్ ఎఫెక్ట్ ఇప్పుడు విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ 'ఎయిరిండియా' (Air India) తన ప్రయాణికులకు గట్టి షాక్ ఇచ్చింది. విమాన ఇంధనమైన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు భారీగా పెరగడంతో.. తమ సర్వీసుల్లో పెద్ద ఎత్తున కోత విధించేందుకు సిద్ధమైంది.

వచ్చే జూన్‌ 1వ తేదీ నుంచి దాదాపు 90 రోజుల పాటు (మూడు నెలలు) పలు అంతర్జాతీయ సర్వీసులతో పాటు, దేశీయ సర్వీసులను కూడా తాత్కాలికంగా తగ్గించనున్నట్లు ఎయిరిండియా వర్గాల సమాచారం. చమురు ధరల పెరుగుదల వల్ల విమాన నిర్వహణ వ్యయం (Operational Costs) విపరీతంగా పెరిగిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఎయిరిండియా సంస్థ వారానికి సగటున 4,400 విమాన సర్వీసులను నడుపుతోంది. ఇందులో దేశీయంగా (Domestic) 3,600 సర్వీసులు, అంతర్జాతీయంగా (International) 800 సర్వీసులు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అయితే తాజా సంక్షోభం కారణంగా ప్రకటించిన యాక్షన్ ప్లాన్ ప్రకారం. అంతర్జాతీయ సర్వీసుల్లో దాదాపు 27 శాతం మేర విమానాలను తగ్గించనున్నారు. దేశీయ సర్వీసుల్లో సైతం 22 శాతం మేర సర్వీసులను కుదించబోతున్నారు. ముందుగా అనుకున్న అంతర్జాతీయ రూట్లతో పాటు, రద్దీ ఎక్కువగా ఉండే కొన్ని దేశీయ మార్గాల్లోనూ ఈ సర్వీసుల తగ్గింపు వర్తించనుంది.

విమాన సర్వీసుల కుదింపు వల్ల వేసవి ప్రయాణాల సీజన్‌లో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, టికెట్లు బుక్ చేసుకున్న ప్యాసింజర్లకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను (Alternative Routes/Arrangements) ఆలోచిస్తున్నట్లు ఎయిరిండియా వర్గాలు పేర్కొన్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story