Rahul Gandhi: రాహుల్ గాంధీకి లక్నో హైకోర్టు షాక్.. పౌరసత్వ వివాదంపై దర్యాప్తుకు ఆదేశం

Rahul Gandhi: రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు. ఆరోపణలపై విచారణ జరపాలని యూపీ సర్కార్ లేదా కేంద్ర దర్యాప్తు సంస్థకు ఆదేశం.

Arun Chilukuri
Published on: 17 April 2026 5:23 PM IST
Rahul Gandhi
X

Rahul Gandhi: రాహుల్ గాంధీకి లక్నో హైకోర్టు షాక్.. పౌరసత్వ వివాదంపై దర్యాప్తుకు ఆదేశం

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పౌరసత్వంపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టు (లక్నో బెంచ్) శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విచారణ బాధ్యతను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లేదా కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోర్టు స్పష్టం చేసింది.

కేసు నేపథ్యం:

బీజేపీ కార్యకర్త ఎస్. విఘ్నేష్ శిశిర్ ఈ వివాదంపై గతంలో న్యాయపోరాటం ప్రారంభించారు. ఆయన వాదనల ప్రకారం..రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ విఘ్నేష్ శిశిర్ తొలుత లక్నోలోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టును ఆశ్రయించారు. అయితే, పౌరసత్వంపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదంటూ ఆ కోర్టు జనవరి 28న పిటిషన్‌ను తిరస్కరించింది. కింది కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు, ప్రాథమికంగా ఈ ఆరోపణలపై దర్యాప్తు అవసరమని భావించి తాజా ఆదేశాలు జారీ చేసింది.

ఆరోపణలేంటి?

రాహుల్ గాంధీ బ్రిటీష్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని, ఇది భారత రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ ఆరోపిస్తున్నారు. ఒక భారతీయ పౌరుడు మరో దేశ పౌరసత్వం కలిగి ఉంటే, అతని భారత పౌరసత్వం చెల్లుబాటు కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ తీర్పుతో రాహుల్ గాంధీ పౌరసత్వంపై దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story