Amarnath Yatra 2026 : హిమాలయాల్లో ఆధ్యాత్మిక సందడి.. మొదలైన అమర్‌నాథ్ యాత్ర..!
Amarnath Yatra 2026 : జమ్మూ కాశ్మీర్ హిమాలయాల్లోని పవిత్ర అమర్‌నాథ్ క్షేత్ర వార్షిక యాత్ర శుక్రవారం తెల్లవారుజామున అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దక్షిణ
Amarnath Yatra 2026
Amarnath Yatra 2026 : జమ్మూ కాశ్మీర్ హిమాలయాల్లోని పవిత్ర అమర్‌నాథ్ క్షేత్ర వార్షిక యాత్ర శుక్రవారం తెల్లవారుజామున అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో సుమారు 3,880 మీటర్ల ఎత్తులో సహజసిద్ధంగా ఏర్పడే మంచు లింగాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తుల మొదటి బ్యాచ్‌లు బల్తాల్, నున్వాన్ బేస్ క్యాంపుల నుండి తమ ప్రయాణాన్ని ప్రారంభించాయని అధికారులు వెల్లడించారు.
రెండు మార్గాల్లో సాగుతున్న యాత్ర
ఈ ఏడాది 57 రోజుల పాటు సాగనున్న ఈ సుదీర్ఘ యాత్ర ఆగస్టు 28వ తేదీన ముగియనుంది. జమ్మూ కాశ్మీర్‌లో కురుస్తున్న అడపా దడపా వర్షాల మధ్యే భక్తులు పవిత్ర గుహ వైపు అడుగులు వేస్తున్నారు. సంప్రదాయబద్ధంగా సాగే 48 కిలోమీటర్ల నున్వాన్-పహల్గామ్ మార్గం ద్వారా కొందరు, అత్యంత కష్టతరమైన 14 కిలోమీటర్ల బల్తాల్ మార్గం ద్వారా మరికొందరు భక్తులు ప్రయాణిస్తున్నారు. పురుషులు, మహిళలతో పాటు భారీ సంఖ్యలో తరలివచ్చిన సాధువుల రాకతో బేస్ క్యాంపులు కిక్కిరిసిపోయాయి. భక్తులు చేసిన 'బమ్ బమ్ భోలే', 'హర హర మహాదేవ్' జయఘోషలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. స్థానిక డెప్యూటీ కమిషనర్లు, ఎస్ఎస్పీలు జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు.
భక్తులకు ఘన స్వాగతం
అంతకుముందు గురువారం రోజే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుండి 4,809 మందితో కూడిన మొదటి బ్యాచ్‌ను జెండా ఊపి పంపించారు. గురువారం మధ్యాహ్నానికి కాశ్మీర్ లోయకు చేరుకున్న ఈ భక్తులకు అక్కడి స్థానిక ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం ఘనంగా, సాదరంగా స్వాగతం పలికారు.
నిఘా నీడలో అమర్‌నాథ్
ఈ పవిత్ర యాత్ర ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. జమ్మూ కాశ్మీర్ పోలీస్ విభాగంతో పాటు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) , ఇతర పారామిలిటరీ బలగాలకు చెందిన వేలాది మంది సైనికులను యాత్రా మార్గాల్లో మోహరించారు. నిరంతరం నిఘా ఉంచేందుకు వీలుగా కీలక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వైమానిక నిఘా (Aerial Surveillance) ను కూడా ఏర్పాటు చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయం మధ్య ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర అధికారికంగా ఊపందుకుంది.




