Bus Accident : అమర్‌నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. ఇంటి కప్పుపై ఆగిన వాహనం.!

Bus Accident : జమ్మూకశ్మీర్‌లోని గాందర్‌బల్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున పవిత్ర అమర్‌నాథ్ యాత్రికులకు పెద్ద ప్రమాదం తప్పింది. బాల్తాల్ బేస్ క్యాంప్ నుంచి..

G Krishna
Published on: 28 July 2026 10:29 AM IST
bus-accident
X

bus-accident

Bus Accident : జమ్మూకశ్మీర్‌లోని గాందర్‌బల్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున పవిత్ర అమర్‌నాథ్ యాత్రికులకు పెద్ద ప్రమాదం తప్పింది. బాల్తాల్ బేస్ క్యాంప్ నుంచి శ్రీనగర్ వైపు వెళ్తున్న ప్రైవేటు యాత్రికుల బస్సు సోనమార్గ్ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. రోడ్డు పక్కన ఉన్న లోయ లాంటి వాలులోకి దొర్లుకుంటూ వెళ్లి కింద ఉన్న ఒక నివాస గృహం కప్పుపై పడి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 30 మంది యాత్రికులు గాయపడగా, అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

25 మీటర్ల కిందకు దొర్లిన బస్సు.. భయాందోళనలో యాత్రికులు

సుమారు 50 మంది ప్రయాణికులతో బాల్తాల్ క్యాంప్ నుంచి బయలుదేరిన ఈ బస్సు, సోనమార్గ్ మార్గంలో ప్రయాణిస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దాంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న దాదాపు 20 నుంచి 25 మీటర్ల లోతైన వాలులో కిందకు దొర్లింది. లోయలో ఉన్న ఒక ఇంటిపైకి బస్సు ల్యాండ్ అవ్వడంతో మరింత కిందకు పడిపోకుండా ఆగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులోని యాత్రికులు తీవ్ర భయాందోళనలకు గురై కేకలు వేశారు. తెల్లవారుజామున కావడం, ప్రాంతం కొండల మధ్య ఉండటంతో కాసేపు ఆందోళనకర వాతావరణం నెలకొంది.

మెరుపు వేగంతో రక్షణ దళాల రెస్క్యూ ఆపరేషన్

సమాచారం అందుకున్న వెంటనే ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) , జమ్మూకశ్మీర్ స్థానిక పోలీసులు సంయుక్తంగా అత్యవసర సహాయక చర్యలు చేపట్టారు. లోయలోకి దిగి బస్సు అద్దాలు పగలగొట్టి లోపల చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా బయటకు తీశారు. ఐటీబీపీకి చెందిన ప్రత్యేక వైద్య బృందాలు (ITBP Medics) సంఘటనా స్థలంలోనే బాధితులకు తక్షణ ప్రాథమిక చికిత్స అందించాయి. అనంతరం గాయపడిన 30 మందిని అంబులెన్సుల్లో సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధితులకు స్వల్ప గాయాలయ్యాయని, అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

ట్రాఫిక్ క్లియరెన్స్.. దర్యాప్తునకు ఆదేశం

భద్రతా దళాల ఉన్నతాధికారులు ప్రమాద స్థలాన్ని నేరుగా సందర్శించి రెస్క్యూ ఆపరేషన్, బాధితుల తరలింపు , రవాణా నిర్వహణను పర్యవేక్షించారు. బస్సు పడిపోవడంతో సోనమార్గ్ రహదారిపై కాసేపు నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి బ్రేకులు ఫెయిల్ అవ్వడం కారణమా లేక మలుపు వద్ద డ్రైవర్ నిద్రమత్తులోకి జారడం వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ వేగవంతం చేశారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story