Amarnath Yatra : భక్తులకు బిగ్ అలర్ట్.. అమర్‌నాథ్, వైష్ణోదేవి యాత్రలు నిలిపివేత.!

Amarnath Yatra : జమ్మూకశ్మీర్‌లో పర్యటించి, పవిత్ర క్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తులకు అలర్ట్. వాతావరణ శాఖ జారీ చేసిన తీవ్రమైన వర్షాల హెచ్చరికల

G Krishna
Published on: 19 July 2026 2:34 PM IST
amarnath-yatra
X

amarnath-yatra

Amarnath Yatra : జమ్మూకశ్మీర్‌లో పర్యటించి, పవిత్ర క్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తులకు అలర్ట్. వాతావరణ శాఖ జారీ చేసిన తీవ్రమైన వర్షాల హెచ్చరికల నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్త చర్యగా ప్రతిష్టాత్మకమైన అమర్‌నాథ్ యాత్ర , మాతా వైష్ణోదేవి క్షేత్ర యాత్రలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగం ప్రకటించింది. కొండ ప్రాంతాలలో వాతావరణం వేగంగా మారుతుండటంతో భక్తుల భద్రత , క్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అధికారులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

అమర్‌నాథ్ యాత్రపై బ్రేక్.. బేస్ క్యాంపుల్లోనే నిలిచిపోయిన భక్తులు

భారత వాతావరణ శాఖ (IMD) జారీ చేసిన ప్రతికూల వాతావరణ నివేదికల ఆధారంగా కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ అన్షుల్ గార్గ్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాశ్మీర్ లోయలో కురుస్తున్న వర్షాల కారణంగా పహల్గామ్ , బల్తాల్ రెండు మార్గాల ద్వారా సాగే శ్రీ అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా కాశ్మీర్ ప్రాంతంలోని బల్తాల్, నున్వాన్ , చందన్‌వారీ బేస్ క్యాంపుల నుండి భక్తులను ముందుకు అనుమతించడం లేదు. అలాగే జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాస్ బేస్ క్యాంప్ నుండి కూడా ఎలాంటి కొత్త భక్తుల కాన్వాయ్‌లను కాశ్మీర్ వైపు వెళ్లేందుకు అధికారులు అనుమతించడం లేదు. వాతావరణ పరిస్థితులను , మార్గాల భద్రతను క్షేత్రస్థాయిలో పూర్తిగా సమీక్షించి, అంతా సురక్షితంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే యాత్ర పునఃప్రారంభంపై తదుపరి అప్‌డేట్స్ ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది కొనసాగుతున్న అమర్‌నాథ్ యాత్రలో ఇప్పటివరకు 3.76 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర మంచు లింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

వైష్ణోదేవి క్షేత్రంలోనూ అదే పరిస్థితి.. అధికారుల హెచ్చరికలు

మరోవైపు జమ్మూ డివిజన్‌లోని త్రికూట పర్వతాలపై కొలువైన శ్రీ మాతా వైష్ణోదేవి యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జమ్మూ అధికారిక ప్రతినిధి ధృవీకరించారు. కొండ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ప్రజా భద్రత దృష్ట్యా యాత్రను నిలిపివేయక తప్పలేదని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉన్న భక్తుల భద్రతను పర్యవేక్షిస్తూ, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొత్తగా ఎవరూ కొండపైకి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవద్దని భక్తులకు సూచించారు. బేస్ క్యాంపుల్లో నిలిచిపోయిన యాత్రికులు అక్కడ ఉన్న అధికారులకు, భద్రతా సిబ్బందికి సహకరించాలని బోర్డు కోరింది.

వాతావరణ శాఖ అలర్ట్.. ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు

జమ్మూకశ్మీర్ అంతటా రానున్న రోజుల్లో మోస్తరు నుండి విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా జులై 19 నుండి జులై 23 వరకు వాతావరణం అత్యంత ప్రతికూలంగా మారే సూచనలు ఉన్నాయి. కొన్ని కొండ ప్రాంతాల్లో క్లౌడ్‌బర్స్ట్ , ఫ్లాష్ ఫ్లడ్స్, రహదారుల బ్లాకేజ్ ముప్పు పొంచి ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాత్రల పునఃప్రారంభం, వాతావరణ మార్పులకు సంబంధించిన తాజా , ఖచ్చితమైన సమాచారం కోసం భక్తులు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, కేవలం ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ప్రకటనలను మాత్రమే ఫాలో అవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story