Delhi: భారత్ ధర్మశాల కాదు.. అక్రమ చొరబాటుదారులపై ఉక్కుపాదం.. అమిత్ షా!
Delhi: ఢిల్లీలో జరిగిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ సదస్సు 2026లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగం.
Delhi: భారత్ ధర్మశాల కాదు.. అక్రమ చొరబాటుదారులపై ఉక్కుపాదం.. అమిత్ షా!
Delhi: భారత్ ను అన్ని విధాలుగా సురక్షిత దేశంగా తీర్చిదిద్దుతామని అమిత్ షా వెల్లడించారు. దేశంలో నివసించే హక్కు కేవలం భారత పౌరులకే ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అంతేకాదు భారత్ లోకి అక్రమంగా చొరబడినవారి పట్ల ఉక్కుపాదం మోపుతామన్నారు. త్వరలోనే భారత్ ను పూర్తిగా చొరబాట్ల రహిత ప్రాంతంగా మారుస్తామని అమిత్ షా తెగేసి చెప్పారు.
సరిహద్దుల్లోని అధికారుల కన్నుగప్పి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన వారి భరతం పడతామని కేంద్ర హెమ్ శాఖా మంత్రి అమిత్ షా హెచ్చరించారు. భారత్ భద్రతకు తమ ప్రభుత్వం నూటికి నూరు శాతం కట్టుబడి ఉందన్నారు. అంతేకాదు భారతదేశంలో నివసించే హక్కు కేవలం భారతీయులకు ఉందన్నారు. ఎవరు పడితే వారు వచ్చి నివసించడానికి భారతదేశం, ధర్మశాల కాదని ఆయన కుండబద్లలు కొట్టారు.
ఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ సదస్సు- 2026లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అంతేకాదు అతి త్వరలోనే దేశాన్ని పూర్తిగా 'చొరబాట్ల రహిత' ప్రాంతంగా మారుస్తామన్నారు.
కాగా గత ఎనిమిది నెలల కాలంలో దేశంలోని అన్ని భూ సరిహద్దు రాష్ట్రాలను తాను స్వయంగా సందర్శించినట్లు అమిత్ షా ఈ సందర్భంగా గుర్తుచేశారు. సరిహద్దు రక్షణ కోసం నాలుగు అంచెల విధానంతో కూడిన మార్గదర్శకాలను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.
అలాగే దేశంలో నేర విచారణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కొత్త నేర చట్టాలు దోహదం చేస్తాయని అమిత్ షా అభిప్రాయపడ్డారు. రానున్న ఒక సంవత్సరంలో కొత్తగా తీసుకువచ్చిన మూడు క్రిమినల్ చట్టాలను వంద శాతం అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ చట్టాల అమలు ద్వారా ఏదైనా క్రిమినల్ కేసుకు సంబంధించి కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు విచారణ ప్రక్రియ కేవలం మూడేళ్లలోపే పూర్తవుతుందన్నారు. తద్వారా నేరస్థుల శిక్షా రేటు కనీసం 25 శాతం పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల గురించి ఆయన తీవ్రంగా స్పందించారు. త్వరలోనే డ్రగ్స్ మహమ్మారిని దేశం నుంచి తరిమేస్తామన్నారు.
దేశంలోని రాష్ట్రాల పోలీసు విభాగం 'నార్కోటిక్స్ కంట్రోల్ విజన్ డాక్యుమెంట్ 2026-2029'ను క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. డ్రగ్స్ రహిత భారత్‌ను సాకారం చేయడానికి పోలీసులు,భద్రతా వ్యవస్థ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అంతేకాదు నేరాలను ముందే అరికట్టడంలో సాంకేతిక పాత్ర కీలకమన్నారు. అలాగే యువ పోలీసు అధికారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నేరస్థుల మాడ్యూల్స్‌ను విశ్లేషించి, భవిష్యత్ సవాళ్లను ముందుగానే పసిగట్టి అడ్డుకోవాలని సూచించారు.




