దీదీకి బెంగాల్‌లోనే ఏమీ మిగలదు.. ఢిల్లీకి ఎలా వస్తారు?: అమిత్ షా ఘాటు విమర్శలు!

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను ఏకం చేసి కేంద్రాన్ని గద్దె దించుతానన్న మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో వేడెక్కిన రాజకీయాలు.

Arun Chilukuri
Published on: 24 April 2026 3:29 PM IST
Amit Shah Slams Mamata Banerjee
X

దీదీకి బెంగాల్‌లోనే ఏమీ మిగలదు.. ఢిల్లీకి ఎలా వస్తారు?: అమిత్ షా ఘాటు విమర్శలు!

Amit Shah: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ యుద్ధం ముదిరింది. కోల్‌కతాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో ఈసారి బీజేపీ పాగా వేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ హయాంలో సాగుతున్న సిండికేట్, మాఫియా, గూండా రాజ్యానికి త్వరలోనే ముగింపు పలుకుతామని ఆయన స్పష్టం చేశారు.

బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతానన్న సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలను అమిత్ షా కొట్టిపారేశారు. ఈ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ చిరునవ్వుతో స్పందించారు. "రాష్ట్రంలోనే అధికారాన్ని కోల్పోతున్న దీదీ, ఇక ఢిల్లీకి ఎలా వెళ్తారు? ఈ ఎన్నికల తర్వాత ఆమెకు బెంగాల్‌లోనే ఏమీ మిగలదు" అని ఎద్దేవా చేశారు.

అంతకుముందు గురువారం పోలింగ్ సమయంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ బీజేపీపై విరుచుకుపడ్డారు. బెంగాల్‌లో గెలిచిన వెంటనే తన దృష్టిని కేంద్ర రాజకీయాల వైపు మళ్లిస్తానని, బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలను ఏకం చేస్తానని ప్రకటించారు. గెలుపు కోసం బీజేపీ నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటూ అన్ని హద్దులు దాటుతున్నారని మండిపడ్డారు.

తమ పార్టీలో ఉంటూ బీజేపీ కోసం పని చేసిన ద్రోహులందరినీ గుర్తుంచుకుంటానని, వారికి తగిన గుణపాఠం చెబుతానని హెచ్చరించారు. బెంగాల్‌లో సత్తా చాటి ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తామని మమత అంటుంటే, అసలు బెంగాల్‌లోనే ఆమెకు స్థానం ఉండదని అమిత్ షా కౌంటర్ ఇస్తుండటంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story