Amit Shah: వ్యవస్థను ధిక్కరించి ఆయుధాలు పట్టినవారు మూల్యం చెల్లించుకుంటారు
Amit Shah: 'నక్సల్ రహిత భారత్' అంశంపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. దీనిపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. ఆయన మాటల్లోని ముఖ్యాంశాలు.
Amit Shah
Amit Shah: మొత్తం వ్యవస్థను తిరస్కరించి ఆయుధాలు చేపట్టేవారిని సహించం. ఆయుధాలు చేపట్టిన వారు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది" అని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు. లోక్‌సభలో 'నక్సల్ రహిత భారత్' అంశంపై జరిగిన చర్చ సందర్భంగా ప్రభుత్వం తరపున ఆయన మాట్లాడారు. సంవత్సరాలుగా అమాయక గిరిజనులను చీకటిలో ఉంచారు. వామపక్షవాదులు తమ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి అమాయక గిరిజనులను తప్పుదోవ పట్టించారు. స్వాతంత్య్రం తర్వాత 75 ఏళ్లలో 60 ఏళ్లు కాంగ్రెస్ పాలించింది. అలాంటప్పుడు గిరిజనులను అభివృద్ధికి ఎందుకు దూరంగా ఉంచారు?" అని ప్రశ్నించారు.
60 ఏళ్లుగా గిరిజనులకు ఇళ్లు, పాఠశాలలు, మొబైల్ టవర్ల సౌకర్యాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదు. ఇప్పుడు లెక్క అడుగుతోంది. మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. నక్సలిజంను సమర్థించే వారిని నేను అడగాలనుకుంటున్నాను, 1970ల నుంచే ఇవన్నీ ఎందుకు జరగలేదు? అని షా అన్నారు.
ప్రభుత్వం విధించిన గడువుకు ఒక రోజు ముందు పార్లమెంటులో నక్సలిజంపై చర్చ జరిగింది. చాలాకాలంగా 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని షా పదేపదే ప్రకటిస్తూ వచ్చారు.
లోక్ సభలో చర్చ సందర్భంగా అమిత్ షా ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
బస్తర్ నుండి నక్సలిజం పూర్తిగా నిర్మూలించాం..
బస్తర్‌లోని ప్రతి గ్రామంలో పాఠశాలలను ప్రారంభించేందుకు ఒక ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రాంతంలోని ప్రతి గ్రామంలో రేషన్ దుకాణాలను ప్రారంభించేందుకు ఒక ప్రచార కార్యక్రమం చేపట్టారు. ప్రతి తహసీల్ - పంచాయతీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు), కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు (CHCలు) ఏర్పాటు చేశాం. ప్రజలకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు జారీ అయ్యాయి. వారు ఇప్పుడు ఐదు కిలోగ్రాముల బియ్యం పొందుతున్నారు.
నక్సలిజంను సమర్థించే వారికి ప్రశ్న..
ఇక్కడ నక్సలిజంను సమర్థించే వారిని నేను ఒక్కటే అడగాలనుకుంటున్నాను.. ఈ ప్రయోజనాలు ప్రజలకు ఇంకా ఎందుకు అందలేదు? ఆ ప్రాంతం 'రెడ్ టెర్రర్' నీడలో ఉండటం వల్ల బస్తర్ ప్రజలు వెనుకబడిపోయారు. అందుకే అభివృద్ధి వారిని చేరలేకపోయింది. ఈ రోజు ఆ నీడ తొలగిపోయింది. బస్తర్ ఇప్పుడు అభివృద్ధి పథంలో ఉంది.
కాంగ్రెస్ 60 ఏళ్లు అధికారంలో ఉంది
70 ఏళ్లలో 60 ఏళ్లు అధికారంలో ఉంది. మరి అలాంటప్పుడు అభివృద్ధి ఎందుకు జరగలేదు. ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఈరోజు లెక్క అడుగుతున్నారు. నేను మీకు పూర్తి కథ చెబుతాను. అక్కడ కోట్లాది మంది ప్రజలు ఏళ్ల తరబడి పేదరికంలో మగ్గారు. ఎవరూ పట్టించుకోలేదు. 20 వేల మంది యువకులు హత్యకు గురయ్యారు. చాలామంది వికలాంగులయ్యారు. కానీ, అభివృద్ధి వారి దాకా చేరలేదు. దీనికి ఎవరు బాధ్యులు? దేశంలోనే అతిపెద్ద పంచాయతీ దీని గురించి ఆలోచించకూడదా? నక్సలిజంకు మూల కారణం అభివృద్ధి డిమాండ్ కాదు, అది ఒక భావజాలం. రాష్ట్రపతి ఎన్నికల కారణంగా ఇందిరా గాంధీ దానిని అంగీకరించారు.
మావోయిస్టులే దేశానికి అతిపెద్ద సమస్య అని మన్మోహన్ సింగ్ అన్నారు:
జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలతో పోలిస్తే, దేశంలో మావోయిస్టులే అతిపెద్ద అంతర్గత భద్రతా సమస్య అని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంగీకరించారు. 2014లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్టికల్ 370ని రద్దు చేశారు. సెక్షన్ 35Aని తొలగించారు. రామ మందిరాన్ని నిర్మించారు. CAAని చట్టంగా చేశారు. శాసనసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారు. ఇవన్నీ నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో జరిగాయి.
ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు:
ప్రతిపక్షానికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు. ఇక్కడ చాలా మంది గత మూడు గంటలుగా అన్యాయం జరిగితే న్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెబుతున్నారు. కానీ ఆ పోరాట పద్ధతి ఏమిటి? మనం బ్రిటిష్ వారి పాలనలో లేము. అయినా కొందరు మనల్ని భగత్ సింగ్, భగవాన్ బిర్సా ముండాలతో పోల్చారు. ఇది ఎంత దుస్సాహసం. భగత్ సింగ్, బిర్సా ముండాలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. అలాంటి వారిని మీరు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, చేతుల్లో ఆయుధాలతో అమాయక ప్రజలను చంపిన వారితో పోలుస్తున్నారు. వారు తమ సొంత ప్రజల రక్తాన్ని చిందించడానికి కూడా వెనుకాడరు. వారి ఆదర్శాలు తిలకా మాంఝీ, బిర్సా ముండా, సుభాష్ బాబు లేదా భగత్ సింగ్ కాదు. వారి ఆదర్శం మావో. ఈ ఆదర్శాలను కూడా వారు విదేశాల నుంచే తెచ్చుకుంటారు.
మొత్తంమీద అమిత్ షా తన ప్రసంగంలో ప్రతి అంశాన్ని లేవనెత్తి.. మావోయిస్టులపై పోరాటం తుది దశకు చేరుకుందని ప్రకటించారు.




