Juhu Beach: బీచ్‌ను శుభ్రం చేసిన మహారాష్ట్ర సీఎం భార్య అమృత, కుమార్తె దివిజ!

Juhu Beach: గణేశ్‌ నిమజ్జనోత్సవం నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి అమృత ఫడణవీస్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ముంబయిలోని జుహూ బీచ్‌లో స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టారు.

Arun Chilukuri
Published on: 26 Sept 2026 1:06 PM IST
Juhu Beach
X

Juhu Beach: బీచ్‌ను శుభ్రం చేసిన మహారాష్ట్ర సీఎం భార్య అమృత, కుమార్తె దివిజ!

Juhu Beach: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృత ఫడణవీస్‌, వారి కుమార్తె దివిజ ముంబయిలోని ప్రముఖ జుహూ బీచ్‌ను శుభ్రం చేసి ఆదర్శంగా నిలిచారు. గణేశ్‌ నిమజ్జనోత్సవాల నేపథ్యంలో అమృత నేతృత్వంలోని 'దివ్యాజ్‌ ఫౌండేషన్', బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సంయుక్తంగా బీచ్‌ వద్ద ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవగణ్‌ కూడా ఉత్సాహంగా పాల్గొని శ్రమదానం చేశారు.

ఈ సందర్భంగా అమృత ఫడణవీస్ మాట్లాడుతూ.. ‘‘మన ముంబయి మహా నగరానికి ఈ సముద్రం ప్రత్యేక అందాన్ని, గుర్తింపును ఇస్తుంది. సముద్ర తీరాలను శుభ్రంగా ఉంచుకోవడం కేవలం పౌర బాధ్యత మాత్రమే కాదు.. నగరం పట్ల మనకున్న నిబద్ధత కూడా. పర్యావరణ పరిరక్షణ కోసం మరింత మంది ప్రజలు, ముఖ్యంగా యువత ముందుకు వచ్చేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం’’ అని పేర్కొన్నారు.

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి పౌర బాధ్యత అని గుర్తుచేశారు. మనం ఏవిధంగా అయితే మన ఇళ్లను శుభ్రంగా ఉంచుకుంటామో.. అదేరీతిలో మన నగరాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రముఖులు స్వయంగా రోడ్డుపైకి వచ్చి బీచ్‌ను శుభ్రం చేయడం పట్ల స్థానికులు, పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.