Amur Falcon: బరువు 150 గ్రాములే.. కట్ చేస్తే.. 4 రోజుల్లో ఆగకుండా 5700 కిలోమీటర్లు ఎగిరేసిందిగా.!

Amur Falcon: మణిపూర్‌లో శాటిలైట్ ట్యాగ్ చేసిన 150 గ్రాముల 'అలాంగ్' అనే ఆడ అముర్ ఫాల్కన్, అరేబియా సముద్రం మీదుగా ఎక్కడా ఆగకుండా 101 గంటల్లో 5,700 కిలోమీటర్లు ప్రయాణించి సోమాలియా చేరిందని, అపాంగ్ అనే మరో పక్షి ఇంకా ప్రయాణంలో ఉందని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది.

Ravi
By Ravi
Published on: 22 Nov 2026 10:53 AM IST
Amur Falcon
X

Amur Falcon: బరువు 150 గ్రాములే.. కట్ చేస్తే.. 4 రోజుల్లో ఆగకుండా 5700 కిలోమీటర్లు ఎగిరేసిందిగా.!

Amur Falcon: ‘అలాంగ్’ అనే చిన్న పక్షి(ఫాల్కన్) 101 గంటల్లో 5,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. మణిపుర్ నుంచి సోమాలియాకు ఆగకుండా వెళ్లడం గమనార్హం. విశ్రాంతి, ఆహారం కోసం ఎక్కడా ఆగకుండా అరేబియా సముద్రాన్ని దాటి వెళ్లింది. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అలాంగ్‌తోపాటు అపాంగ్ అనే మరో పక్షికి ట్రాకింగ్ డివైజెస్ అమర్చి వాటిని పర్యవేక్షిస్తోంది.

కాగా ‘అలాంగ్’ బరువు కేవలం 150 గ్రాములు. అలాంగ్ ఒక చిన్న వయసు ఆడ అముర్ ఫాల్కన్. ఈ పక్షి నవంబర్ 19న మణిపూర్‌లోని తమెంగ్లాంగ్ జిల్లా చియులువాన్ రూస్టింగ్ సైట్ నుంచి బయలుదేరి, నవంబర్ 21 ఉదయం 5:30కి సోమాలియా చేరింది. అంటే 4 రోజుల 5 గంటల పాటు గాలిలోనే ఉంది. ఈ ప్రయాణానికి ముందు సుమారు 25 రోజులు ఆమె తమెంగ్లాంగ్‌లో ఉండి, కీటకాలు తిని శక్తి నిల్వ చేసుకుందని అధికారులు తెలిపారు.

వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు మణిపూర్ అటవీ శాఖ సహకారంతో 2025 నవంబర్‌లో ఈ పక్షులకు శాటిలైట్ ట్రాన్స్‌మిటర్లు అమర్చారు. అలాంగ్, అపాంగ్‌తో పాటు అహు అనే మరో పక్షికి కూడా ఈ ట్యాగ్ పెట్టారు. వాటి వలస మార్గాలను అధ్యయనం చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

అలాంగ్, అపాంగ్ ఈ ఏడాది అక్టోబర్ చివర్లో తిరిగి తమెంగ్లాంగ్ చేరుకున్నాయి. అంటే వార్షిక వలస చక్రం పూర్తి చేశాయి. అపాంగ్ ఒక పెద్ద మగ పక్షి. అది 95 గంటల్లో సుమారు 4,100 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించి, ఇంకా అరేబియా సముద్రంపై ఎగురుతోంది. ఈ వివరాలను WII శాస్త్రవేత్త డాక్టర్ ఆర్. సురేశ్ కుమార్ వెల్లడించారు.

అముర్ ఫాల్కన్లు ప్రతి ఏటా చైనా, సైబీరియా ప్రాంతాల నుంచి ఈశాన్య భారతదేశం మీదుగా ఆఫ్రికాకు వలస వెళ్తాయి. మణిపూర్, నాగాలాండ్‌లలో కీటకాలు తిని శక్తి కూడబెట్టుకుంటాయి.

ఆ తర్వాత అరేబియా సముద్రాన్ని దాటి సోమాలియా, కెన్యా వైపు వెళ్తాయి. తమెంగ్లాంగ్, నోనీ జిల్లాల్లో ఈ పక్షులను వేటాడటం, పట్టుకోవడం, చంపడం, అమ్మడంపై పూర్తి నిషేధం అమల్లో ఉంది. ఈ పక్షులను రక్షించడానికి స్థానిక సమాజాలు, అటవీ శాఖ, శాస్త్రవేత్తలు కలిసి పనిచేస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.