అంకిత భండారీ కేసులో ముగ్గురికి జీవిత ఖైదు.. శిక్ష పడటానికి కారణాలివే!
Ankita Bhandari: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన 2022 నాటి అంకిత భండారీ హత్య కేసులో నిందితులకు శిక్ష పడటంపై ఉత్తరాఖండ్ అదనపు డైరెక్టర్ జనరల్
అంకిత భండారీ కేసులో ముగ్గురికి జీవిత ఖైదు.. శిక్ష పడటానికి కారణాలివే!
Ankita Bhandari: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన 2022 నాటి అంకిత భండారీ హత్య కేసులో నిందితులకు శిక్ష పడటంపై ఉత్తరాఖండ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (క్రైమ్ అండ్ లా అండ్ ఆర్డర్) డాక్టర్ వి. మురుగేశన్ గురువారం స్పందించారు. డెహ్రాడూన్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఐడీ, ప్రత్యేక విచారణ బృందం (SIT) , ప్రాసిక్యూషన్ వేగంగా స్పందించి, పక్కా సాక్ష్యాధారాలను సేకరించడం వల్లే నిందితులందరికీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిందని వెల్లడించారు.
రిషికేష్ సమీపంలోని 'వనాంతర రిసార్ట్'లో 19 ఏళ్ల అంకిత భండారీ రిసెప్షనిస్ట్‌గా పనిచేసేది. ఆమె దారుణ హత్యకు గురికావడం, సెప్టెంబర్ 18, 2022న చిల్లా కాలువలో మృతదేహం లభించడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. కేసు తీవ్రత , సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆదేశాల మేరకు డిఐజి స్థాయి మహిళా ఐపీఎస్ అధికారిణి నేతృత్వంలో తక్షణమే సిట్ (SIT) ఏర్పాటు చేశారు. ఘటన వెలుగులోకి వచ్చిన 24 గంటల్లోనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
సిట్ బృందం డిజిటల్, సాంకేతిక, ఫోరెన్సిక్ , ప్రత్యక్ష ఆధారాలను సమగ్రంగా సేకరించి, ఘటనల క్రమాన్ని నిర్ధారించింది. కేవలం 88 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి, కోర్టులో సుమారు 500 పేజీల విస్తృత ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. మాజీ బిజెపి నేత వినోద్ ఆర్య కుమారుడు, రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్యా ప్రధాన నిందితుడు కాగా, రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తాలను నిందితులుగా చేర్చారు.
కోట్ద్వార్లోని అదనపు జిల్లా , సెషన్స్ కోర్టు మే 30, 2025న ఈ కేసులో తీర్పు వెలువరించింది. సిట్ సేకరించిన సాక్ష్యాలు, ప్రాసిక్యూషన్ వినిపించిన బలమైన వాదనల ఆధారంగా పుల్కిత్ ఆర్యా, సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తాలను దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు వారికి కఠిన యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ప్రస్తుతం ముగ్గురు నిందితులు జైలులోనే శిక్ష అనుభవిస్తున్నారని, బాధితురాలి కుటుంబానికి , సమాజానికి న్యాయం జరిగేలా సమర్థవంతంగా విచారణ పూర్తి చేశామని ఏడీజీపీ స్పష్టం చేశారు.




