Anna Hazare: ఢిల్లీ ఘటనలపై స్పందించిన అన్నా హజారే.. ప్రధాని మోదీకి లేఖ!

Anna Hazare: ఢిల్లీలో సీజేపీ నిరసనలు, పోలీసుల చర్యలపై ప్రధాని మోదీకి అన్నా హజారే లేఖ రాశారు.

Arun Chilukuri
Published on: 23 July 2026 10:30 AM IST
Anna Hazare
X

Anna Hazare: ఢిల్లీ ఘటనలపై స్పందించిన అన్నా హజారే.. ప్రధాని మోదీకి లేఖ!

Anna Hazare: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనలలో చోటుచేసుకున్న హింస, విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌ ఘటనలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సుదీర్ఘమైన లేఖ రాశారు. విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను కేవలం శాంతిభద్రతల అంశంగా కాకుండా, సామాజిక సమస్యగా పరిగణించి వారితో ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని ఆయన సూచించారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా సీజేపీ నిర్వహించిన ‘చలో సంసద్’ ర్యాలీలో పేపర్ లీక్‌లు, పరీక్షల్లో అవకతవకలు, విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్లతో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన అన్నా హజారే.. ప్రజాస్వామ్యంలో హింసకు గానీ, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి గానీ, అలాగే పోలీసుల అనవసర బలప్రయోగానికి గానీ స్థానం లేదని స్పష్టం చేశారు. యువత నిరుద్యోగం, ఉద్యోగ నియామకాల జాప్యంపై వ్యక్తపరుస్తున్న ఆందోళనలను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో చూడాలని కోరారు.

ముఖ్యంగా నీట్ (NEET) పరీక్ష వివాదాన్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ వ్యవస్థలో లోపాలు తలెత్తినప్పుడు కేవలం కింది స్థాయి అధికారులను బలిపశువులను చేయడం సరికాదన్నారు. ఆయా శాఖలకు నాయకత్వం వహించే మంత్రులే పూర్తి రాజకీయ జవాబుదారీతనం వహించాలని అభిప్రాయపడ్డారు. వైఫల్యాలు ఎదురైనప్పుడు బాధ్యులైన మంత్రులను తప్పించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ తగ్గదని, పైగా అది సమర్థవంతమైన పాలనకు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో ఘర్షణల కంటే చర్చలే ఉత్తమ మార్గమని లేఖలో గుర్తుచేసిన హజారే.. ప్రజల నిరసన స్వరాన్ని కేవలం ప్రతిపక్షాల కుట్రగా చూడకూడదని హితవు పలికారు. ఇదే సమయంలో లడఖ్‌కు చెందిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష పట్ల కూడా ప్రభుత్వం స్పందించి, వారితో చర్చలు జరపాలని మోదీని అన్నా హజారే కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story