Annamalai: బీజేపీకి గుడ్‌బై.. 24 గంటల్లోనే అన్నామలై పొలిటికల్ సెన్సేషన్: ఊహించని ప్రజా మద్దతు!

Annamalai: తమిళనాడు బీజేపీకి రాజీనామా చేసిన 24 గంటల్లోనే మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై సరికొత్త రాజకీయ సంచలనానికి తెరలేపారు.

Arun Chilukuri
Published on: 6 Jun 2026 5:24 PM IST
Annamalai: బీజేపీకి గుడ్‌బై.. 24 గంటల్లోనే అన్నామలై పొలిటికల్ సెన్సేషన్: ఊహించని ప్రజా మద్దతు!
X

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సంచలన నిర్ణయంతో గుడ్‌బై చెప్పిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. జూన్ 5న (నిన్న) అధికారికంగా బీజేపీకి రాజీనామా చేసిన ఆయన, మరుసటి రోజే ఒక వినూత్న రాజకీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమాన్ని ప్రకటించిన కేవలం 24 గంటల వ్యవధిలోనే ద్రవిడ గడ్డపై అన్నామలైకు అపూర్వమైన ప్రజా మద్దతు లభించడం విశేషం.

బీజేపీని వీడిన అనంతరం అన్నామలై తన రాజీనామాకు గల కారణాలను బహిర్గతం చేశారు. గత 18 నెలలుగా తనకు పార్టీ అధిష్ఠానంతో తీవ్రమైన సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. తమిళనాడు రాజకీయ పరిస్థితులు, ఇక్కడి వ్యూహాలపై తనకున్న వ్యక్తిగత అభిప్రాయాలు.. బీజేపీ జాతీయ నాయకత్వ అభిప్రాయాలతో ఏమాత్రం మెరుగవకపోవడం వల్లే తాను బయటకు రావాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తన ఈ నూతన ప్రయాణాన్ని 'ప్రజా కేంద్రిత రాజకీయాల సరికొత్త శకం'గా ఆయన అభివర్ణించారు.

వ్యక్తిపూజ, వంశపారంపర్య రాజకీయాలకు ముగింపు పలకడమే లక్ష్యంగా అన్నామలై ‘‘వి ద లీడర్’’ (We The Leader) అనే సరికొత్త రాజకీయ ఉద్యమ వేదికను ఏర్పాటు చేశారు. ఈ ఉద్యమానికి తమిళనాడు యువత, సామాన్య ప్రజల నుంచి ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది.

'వి ద లీడర్' అధికారిక వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం.. ఉద్యమం ప్రారంభించిన తొలి రోజే ఏకంగా 14 లక్షల మంది సభ్యులు తమ పేర్లను డిజిటల్‌గా నమోదు చేసుకుని అన్నామలైకు మద్దతు పలికారు. ఈ ఉద్యమం ద్వారా విద్య, వైద్యం, పర్యావరణం, యువ నాయకత్వం (Youth Leadership) వంటి విభిన్న రంగాలలో సమాజానికి సేవ చేయాలనుకునే స్వచ్ఛంద కార్యకర్తలను, నిపుణులను ఒకే తాటిపైకి తీసుకురానున్నారు.

రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరాన్ని ఉద్ఘాటిస్తూ అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. "రాజకీయాలు అంటే కేవలం కొద్దిమంది ఇళ్లకో, కొన్ని కుటుంబాలకో లేదా శాశ్వతంగా పదవుల్లో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలకో పరిమితం కాకూడదు. రాజకీయాన్ని సామాన్య ప్రజల వద్దకు చేర్చాలనేదే నా సంకల్పం. రాబోయే రోజుల్లో ఈ కొత్త ఉద్యమం ద్వారానే తమిళనాడులో జరగబోయే తదుపరి లోక్‌సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తాం" అని అన్నామలై ప్రకటించారు. అన్నామలై వేసిన ఈ సంచలన అడుగు తమిళనాడులోని అధికార డీఎంకే, విపక్ష ఏఐఏడీఎంకేతో పాటు బీజేపీ వర్గాల్లోనూ సరికొత్త చర్చకు దారితీసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story