CM Vijay: సీఎం సార్ బీరు బాటిల్‌పై రూ.10 ఎక్కువ తీసుకుంటున్నారు..!

CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ ఇచ్చిన అవినీతి వ్యతిరేక పిలుపుకు వినూత్న స్పందన వచ్చింది.

Naresh.k
Updated on: 16 July 2026 11:35 AM IST
CM Vijay
X

CM Vijay: సీఎం సార్ బీరు బాటిల్‌పై రూ.10 ఎక్కువ తీసుకుంటున్నారు..!

Tamil Nadu:తమిళనాడు రాజకీయాల్లో మార్పు కోసం, అవినీతిపై పోరాటం చేయాలంటూ ముఖ్యమంత్రి విజయ్ ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన లభిస్తోంది. అయితే, సీఎం పిలుపును అందుకున్న ఓ యువకుడు ఏకంగా ప్రభుత్వ వైన్ షాప్ ముందే అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మందుబాబుల కష్టాలు, వారి నుంచి జరుగుతున్న అక్రమ వసూళ్లపై సదరు యువకుడు చేసిన లైవ్ పోరాటం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

సాధారణంగా వైన్ షాపుల్లో ఎంఆర్‌పి ధరల కంటే ఎక్కువ వసూలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, ఈ యువకుడు మాత్రం దానిని చూస్తూ ఊరుకోలేదు. ప్రభుత్వ వైన్ షాపులో బీరు అసలు ధర రూ. 160 కాగా.. కూలింగ్ చార్జీల పేరుతో రూ. 10 అదనంగా వసూలు చేస్తూ రూ. 170కి అమ్ముతున్నారంటూ సదరు యువకుడు అక్కడికక్కడే నిలదీశాడు.

వైన్ షాప్ ముందే సెల్ఫీ వీడియో రికార్డు చేస్తూ సిబ్బంది భాగోతాన్ని బయటపెట్టాడు. దీంతో లోపల ఉన్న సిబ్బంది అతడిని బెదిరించే ప్రయత్నం చేసినా, సదరు యువకుడు అస్సలు భయపడలేదు. మీరు నన్ను హెచ్చరించినా సరే.. నేను వీడియో తీస్తూనే ఉంటా, దీనిని ఫేస్‌బుక్‌లో పెడతా అంటూ ధైర్యంగా వాదించాడు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఈ ప్రభుత్వ వైన్ షాప్ లైసెన్స్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశాడు.

యువకుడు కేవలం వీడియో తీసి వదిలేయకుండా.. ఆ వీడియోను ఏకంగా తమిళనాడు సీఎం విజయ్‌కు ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రభుత్వానికి అత్యధికంగా పన్నుల రూపంలో ఆదాయం అందించేది మందుబాబులే. అలాంటి వారి సమస్యను వెంటనే పరిష్కరించి, అదనపు వసూళ్లకు అడ్డుకట్ట వేయాలి అని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

మరికొందరేమో.. రూ. 10 కోసం ఇంత గొడవెందుకు.. అసలు తాగడం మానేస్తే ఆరోగ్యంతో పాటు డబ్బులూ మిగులుతాయి కదా అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. అయితే సీఎం విజయ్ పిలుపునిచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చిన తొలి వినూత్న అవినీతి ఫిర్యాదు ఇది కావడంతో.. ఇప్పుడు సీఎంఓ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది.


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story