Chandrababu: దక్షిణాదికి ద్రోహం చేసింది డీఎంకేనే.. కోయంబత్తూరు సభలో చంద్రబాబు ఫైర్..!
Chandrababu: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. మహిళా రిజర్వేషన్, నదుల అనుసంధానం మరియు డీఎంకే వైఫల్యాలపై ఏపీ సీఎం విమర్శల పూర్తి వివరాలు
Chandrababu: దక్షిణాదికి ద్రోహం చేసింది డీఎంకేనే.. కోయంబత్తూరు సభలో చంద్రబాబు ఫైర్..!
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎంకే మరియు ఇండియా కూటమి లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం కోయంబత్తూరులో ఎన్డీఏ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లును, డిలిమిటేషన్ ప్రక్రియను అడ్డుకుని డీఎంకే చారిత్రక తప్పిదం చేసిందని మండిపడ్డారు.
ప్రధాని మోదీ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చట్టం తీసుకువస్తే, డీఎంకే, కాంగ్రెస్ వంటి పార్టీలు రాజకీయ లబ్ధి కోసం దానిని వ్యతిరేకించాయని చంద్రబాబు ఆరోపించారు. "గత 30 ఏళ్లుగా మహిళలు తమ హక్కుల కోసం ఎదురుచూస్తున్నారు. దేవెగౌడ హయాంలో కాంగ్రెస్ అడ్డుకుంటే, ఇప్పుడు మోదీ తెచ్చిన బిల్లును ఇండియా కూటమి అడ్డుకుంది. ఇది మహిళా లోకానికి వారు చేసిన ద్రోహం" అని ఆయన దుయ్యబట్టారు.
డిలిమిటేషన్ బిల్లు ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు కనీసం 50 శాతం సీట్లు పెరిగి మేలు జరుగుతుందని, కానీ డీఎంకే కావాలనే అపోహలు సృష్టించిందని చంద్రబాబు వివరించారు. తమిళ ప్రజల మధ్య విద్వేషాలను రగిల్చి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. నేరాలు, డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోయాయని, అభివృద్ధి పట్టాలెక్కాలంటే 'డబుల్ ఇంజన్ సర్కార్' అవసరమని స్పష్టం చేశారు.
తమిళనాడు నీటి కష్టాలను తీర్చేందుకు గోదావరి-కావేరి నదుల అనుసంధానం ఏకైక మార్గమని చంద్రబాబు పేర్కొన్నారు. "గతంలో ఎన్టీఆర్ హయాంలో తెలుగు గంగ ద్వారా చెన్నైకి నీరిచ్చాం. ఇప్పుడు మోదీ నాయకత్వంలో నదుల అనుసంధానం జరిగితే తమిళనాడుకు నీటి భద్రత లభిస్తుంది" అని భరోసా ఇచ్చారు.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలది ద్రవిడ సంస్కృతేనని, తమిళ భాషపై ఆ రాష్ట్ర ప్రజలకున్న మక్కువ స్ఫూర్తిదాయకమని చంద్రబాబు కొనియాడారు. కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం ద్వారా తమ సంస్కృతిని కాపాడుతున్నామని గుర్తుచేశారు. జయలలిత ఆశయాలకు అనుగుణంగా ఏఐఏడీఎంకే-బీజేపీ (NDA) కూటమిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, తమిళనాడు బీజేపీ నేతలు మరియు ఎన్డీఏ అభ్యర్థులు పాల్గొన్నారు.




