Pawan Kalyan: జిందాల్ ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్‌లో పవన్ కల్యాణ్ పర్యటన.. కాలుష్య నియంత్రణపై కీలక ఆదేశాలు!

Pawan Kalyan: నాయుడుపేటలోని జిందాల్ ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సందర్శించారు.

Arun Chilukuri
Published on: 30 May 2026 4:54 PM IST
Pawan Kalyan
X

Pawan Kalyan: జిందాల్ ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్‌లో పవన్ కల్యాణ్ పర్యటన.. కాలుష్య నియంత్రణపై కీలక ఆదేశాలు!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పర్యావరణ-అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ శనివారం నాయుడుపేటలోని జిందాల్‌ ‘వేస్ట్‌ టు ఎనర్జీ’ (Waste-to-Energy) ప్లాంట్‌ను సందర్శించారు. నగరాల్లో పేరుకుపోతున్న చెత్తను సమర్థవంతంగా రీసైకిల్ చేస్తూ, దాని ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న ఈ ప్లాంట్ పనితీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ పర్యటనలో భాగంగా ప్లాంట్‌ ఏర్పాటుకు అయిన వ్యయం, దాని రోజువారీ నిర్వహణ తదితర అంశాల గురించి పవన్ కల్యాణ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న విద్యుత్ పరిమాణం ఎంత? గ్రిడ్‌కు విక్రయిస్తున్న యూనిట్‌ విక్రయ ఛార్జీల వివరాలు ఏంటి? అనే విషయాలను ప్లాంట్‌ ప్రతినిధులు డిప్యూటీ సీఎంకు సమగ్రంగా వివరించారు.

ఈ సందర్భంగా కాకినాడలో ఏర్పాటు చేయాల్సిన జిందాల్ ప్లాంట్ ఆలస్యం కావడంపై పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. "కాకినాడ జిందాల్‌ ప్లాంట్‌ పనులు పూర్తి కావస్తున్నా ఇంకా ఎందుకు వినియోగంలోకి రాలేదు?" అని ఆయన ప్రశ్నించారు. దీనిపై జిందాల్ ప్రతినిధులు స్పందిస్తూ.. సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యమైందని, రాబోయే నవంబరు లోపు కాకినాడ ప్లాంట్‌ను ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకొస్తామని డిప్యూటీ సీఎంకు హామీ ఇచ్చారు.

చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే క్రమంలో పర్యావరణానికి ఎలాంటి హాని జరగకూడదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ తరహా విద్యుత్‌ ప్లాంట్లలో వెలువడే కాలుష్యంపై, దాన్ని అరికట్టేందుకు తీసుకుంటున్న కాలుష్య నియంత్రణ చర్యలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. దీనిపై జిందాల్‌ యాజమాన్యం స్పందిస్తూ.. కాలుష్య నియంత్రణ మండలి (APPCB) నిబంధనలను తాము పక్కాగా పాటిస్తున్నామని, ఏడాదికి నాలుగుసార్లు కాలుష్య నియంత్రణపై పీసీబీ తమకు నివేదిక ఇస్తోందని పవన్ కల్యాణ్‌కు వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story