Rajouri Encounter : ఉగ్రవాదుల వేటలో ఘోర ప్రమాదం.. లోయలో జారిపడి జారిపడి లెఫ్టినెంట్ వీరమరణం
Indian Army, Rajouri Encounter, Martyrdom, Operation Sheruvali,
Rajouri Encounter
Rajouri Encounter : జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేత చర్యల్లో నిరంతరం శ్రమిస్తున్న భారత సైన్యంలో తీవ్ర విషాదం నెలకొంది. రాజౌరీ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగిన ఒక ప్రమాదంలో భారత సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ ర్యాంక్ అధికారి ఒకరు వీరమరణం పొందారు. దట్టమైన అడవులు, ఎత్తైన కొండల మధ్య ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి లోతైన లోయలో పడిపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో రక్షణ విభాగంలో ఒక్కసారిగా తీవ్ర శోకం వ్యక్తమవుతోంది.
సైనిక వర్గాల సమాచారం ప్రకారం.. రాజౌరీ జిల్లాలోని డోరిమాల్, గంభీర్ ముగ్లాన్ బెల్ట్ పరిధిలో గత 15 రోజులుగా ఆపరేషన్ షేరువాలీ పేరుతో ఒక సుదీర్ఘ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ సాగుతోంది. ఆ ప్రాంతంలోని అడవుల్లో ఇద్దరు లేదా ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు దాక్కున్నట్లు నిఘా వర్గాల నుంచి బలమైన సమాచారం అందింది. ఈ ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ ఆధారంగానే భారత సైన్యం, స్థానిక పోలీసులు, పారామిలట్రీ బలగాలు సంయుక్తంగా ఈ భారీ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి.
శనివారం సాయంత్రం డోరిమాల్ పరిధిలోని అత్యంత దుర్ఘటమైన కొండ ప్రాంతంలో సైన్యం ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. ఈ క్రమంలో చీకటి పడుతున్న సమయంలో సదరు లెఫ్టినెంట్ కాలు జారడంతో నేరుగా 30 మీటర్ల లోతున ఉన్న ఒక లోయలోకి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి జవాన్లు శరవేగంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఆయన్ను పైకి తీసుకొచ్చారు. అయితే, అంత ఎత్తు నుంచి పడటం వల్ల శరీరానికి తీవ్రమైన గాయాలు కావడంతో ఆయన అప్పటికే తుదిశ్వాస విడిచారు.
ఘటనా స్థలం నుంచి శ్రమించి ఆ అధికారి పార్థివ దేహాన్ని రక్షక బలగాలు వెలికితీశాయి. సైన్యం, స్థానిక అధికార యంత్రాంగం అవసరమైన అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేస్తున్నాయి. అమరుడైన ఆ అధికారి పూర్తి గుర్తింపు, వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈరోజు జమ్మూలో జరిగే ఒక ప్రత్యేక అధికారిక కార్యక్రమంలో సీనియర్ సైనిక అధికారులు, తోటి జవాన్లు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీర జవాన్‌కు ఘనంగా అంతిమ నివాళులు అర్పించనున్నారు.
కొండ ప్రాంతాల్లో ఎంతటి కఠిన పరిస్థితులు ఉన్నప్పటికీ రాజౌరీ అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని సైన్యం స్పష్టం చేసింది. లెఫ్టినెంట్ వీరమరణం పొందినప్పటికీ సెర్చ్ ఆపరేషన్‌ను మరింత ముమ్మరం చేశారు. ఈ ప్రాంతంలోకి అదనపు బలగాలను రంగంలోకి దించారు. దట్టమైన అడవులను జల్లెడ పట్టేందుకు ఆధునిక డ్రోన్లు, థర్మల్ కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాల సాయంతో నిఘాను కట్టుదిట్టం చేశారు. ఆ ప్రాంతాన్ని ఉగ్రరహితంగా మార్చే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.




