Arunachal Pradesh Floods : అరుణాచల్‌లో జలప్రళయం.. భారీగా ఆస్తి నష్టం.. పలువురు గల్లంతు..!

Arunachal Pradesh Floods : ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కేయి పన్యార్ ప్రాంతంలో కురిసిన కుండపోత..

G Krishna
Published on: 25 Jun 2026 9:42 AM IST
arunachal pradesh flash floods
X

arunachal pradesh flash floods

Arunachal Pradesh Floods : ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కేయి పన్యార్ ప్రాంతంలో కురిసిన కుండపోత వానలకు కొండచరియలు విరిగిపడి జలప్రళయం సృష్టించాయి. ఈ ప్రకృతి విపత్తులో ఒక మహిళ మరణించగా, నలుగురు వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. మరో పదిహేడు మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇళ్లు కూలిపోతూ, రోడ్లు కొట్టుకుపోతూ రాష్ట్రం అతలాకుతలమవుతోంది.

ఒకరి మృతి.. నలుగురి కోసం గాలింపు

వరద ఉధృతికి ఒకేసారి ఐదుగురు వ్యక్తులు బలమైన ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారి కోసం విపత్తు నిర్వహణ బృందాలు గాలించగా.. పూసా ప్రాంతంలో నివసించే వివేకానంద కేంద్ర విద్యాలయం ఉపాధ్యాయురాలైన నిర్మలా గుప్తా (35) మృతదేహం లభ్యమైంది. గల్లంతైన మిగిలిన నలుగురు.. ఎలేష్ మారక్ (13), బలారి మారక్ (30), టావో అంజీనా (46), సౌరవ్ కుమార్‌ల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

కూలిన ఇళ్లు.. ఆసుపత్రిలో క్షతగాత్రులు

వరదల ధాటికి ఒక నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోవడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ ఘటనలో కనీసం పద్దెనిమిది ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రమాదంలో గాయపడిన పదిహేడు మందిని జీరో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ప్రాణాలు కాపాడిన రెస్క్యూ టీమ్స్

ప్రమాదకర పరిస్థితుల్లోనూ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), పోలీసులు కలిసి పలువురి ప్రాణాలను కాపాడారు. యజలి జలాశయంలో చిక్కుకున్న బిషు సిన్హా అనే వ్యక్తిని రక్షించారు. అలాగే కేయి పన్యోర్ డ్యామ్ వద్ద వరదల్లో చిక్కుకుపోయిన ఒక వ్యక్తిని, అతని పెంపుడు కుక్కను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. జాతీయ రహదారి 13పై కొండచరియల మధ్య ఇరుక్కుపోయిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) శాస్త్రవేత్తను కూడా రెస్క్యూ టీమ్ కాపాడింది.

ఆరు జిల్లాలకు తెగిపోయిన సంబంధాలు

కొండచరియలు విరిగిపడటంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. జాతీయ రహదారి 13తో పాటు కిమిన్-జిరో మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ఫలితంగా కేయి పన్యోర్, క్రా దాడి, కురుంగ్ కుమే, లోయర్ సుబన్సిరి, కామ్లే, అప్పర్ సుబన్సిరి సహా ఆరు జిల్లాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) సిబ్బంది యుద్ధప్రాతిపదికన రోడ్లను క్లియర్ చేసే పనిలో ఉన్నారు.

రంగంలోకి వైమానిక దళం హెలికాప్టర్లు

ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ భారత వైమానిక దళం (IAF) రంగంలోకి దిగింది. హోలోంగి నుండి బయలుదేరిన హెలికాప్టర్ ద్వారా సహాయక సిబ్బందిని, రబ్బరు పడవలను వరద ప్రభావిత ప్రాంతాలకు చేరవేశారు. స్థానిక యంత్రాంగం, పోలీసులతో పాటు మాజీ సైనికులు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకుంటున్నారు. ముందస్తు జాగ్రత్తగా నీప్కో హైడ్రోపవర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ నుండి నీటిని కిందకు విడుదల చేశారు.

రాష్ట్రంలో రాబోయే కొన్ని రోజుల పాటు మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో, నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story