Arvind Kejriwal: ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై ఆంక్షలు.. మెటాపై అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు
Arvind Kejriwal: E20 పెట్రోల్ వివాదం వేళ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై ఆంక్షలు విధించారని మెటా సంస్థపై ఏఏపీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు.
Arvind Kejriwal: ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై ఆంక్షలు.. మెటాపై అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు
Arvind Kejriwal: సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ (Meta) తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత్‌లో తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతాపై మెటా ఆంక్షలు విధించిందని, భారత్‌లోని వినియోగదారులకు తన ప్రొఫైల్ అందుబాటులో లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు.
కేవలం భారతదేశంలోనే తన ఇన్‌స్టా ఖాతాపై పరిమితులు విధిస్తున్నారని, దీనిపై మెటా ప్రతినిధులకు ఎన్ని ఈ-మెయిల్స్ పంపినా కేవలం ఆటోమేటెడ్ రెస్పాన్స్ వస్తోంది తప్ప స్పష్టమైన కారణం చెప్పడం లేదని కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేశారు. "మీ ఆఫీస్‌లో ఉన్నవారు ఎవరూ దీనికి స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు. ఆంక్షలు ఎలా తొలగించాలో కూడా సూచించడం లేదు. మీ సేవలు చాలా చెత్తగా ఉన్నాయి" అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా దుయ్యబట్టారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న E20 (20 శాతం ఇథనాల్ కలిపిన) పెట్రోల్ విధానం వాహనాలపై చూపే ప్రతికూల ప్రభావాల గురించి, దానిపై వెలువడిన నివేదికల గురించి తాను వరుసగా పోస్టులు పెడుతుండటంతోనే తన ఖాతాను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వీడియో ఫేస్‌బుక్‌లో కొద్దిసేపు నిలిచిపోవడంతో (టెక్నికల్ ఎర్రర్ వల్ల), మెటా గ్లోబల్ టీమ్ కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పిన విషయాన్ని కేజ్రీవాల్ ప్రస్తావించారు. "ప్రధాని మోదీ ముందు మెటా అంతలా తలవొంచాల్సిన అవసరం లేదు. లేకపోతే భవిష్యత్తులో భారత్‌లో కేవలం ఆయన ఒకరి ఖాతాను మాత్రమే నడపడానికి మిమ్మల్ని అనుమతిస్తారు" అంటూ కేంద్రంపై మరియు మెటాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, కేజ్రీవాల్ చేసిన ఈ ఆరోపణలు, విమర్శలపై మెటా సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.




