Supreme Court: పౌరసత్వ నిర్ధారణ పారదర్శకంగా ఉండాలి: సుప్రీంకోర్టు కీలక తీర్పు!
Supreme Court: అస్సాంలో విదేశీయులుగా ముద్రపడిన 27 మంది పౌరులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
Supreme Court: పౌరసత్వ నిర్ధారణ పారదర్శకంగా ఉండాలి: సుప్రీంకోర్టు కీలక తీర్పు!
Supreme Court: పౌరసత్వాన్ని ధ్రువీకరించే ప్రక్రియ, అలాగే ఒకరిని విదేశీయుడిగా గుర్తించే విధానం అత్యంత పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అస్సాంలో అధికారులు, ట్రైబ్యునళ్ల నిర్ణయాల వల్ల విదేశీయులుగా ముద్రపడిన 27 మంది పౌరులకు రక్షణ కల్పిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వం మరియు విదేశీ హోదా అనేవి రాజ్యాంగపరంగా, చట్టబద్ధంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశాలని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తుచేసింది.
పాత ఓటర్ల జాబితాలో జరిగిన టైపింగ్ తప్పిదాలు, పేర్ల స్పెల్లింగ్‌లోని చిన్నచిన్న వ్యత్యాసాలను సాకుగా చూపి అస్సాంకు చెందిన 27 మందిని అధికారులు విదేశీయులుగా ప్రకటించారు. దీనిని గువాహటి హైకోర్టు మరియు స్థానిక ట్రైబ్యునళ్లు సైతం సమర్థించాయి. అయితే, ఈ నిర్ణయాలను సవాలు చేస్తూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా అత్యున్నత న్యాయస్థానంలో వారికి పెద్ద ఊరట లభించింది. గువాహటి హైకోర్టు, ట్రైబ్యునళ్లు ఇచ్చిన పూర్వపు తీర్పులను సుప్రీంకోర్టు పూర్తిగా పక్కన పెట్టింది.
ఎవరైనా వ్యక్తులు చట్టవిరుద్ధంగా, తప్పుడు మార్గాల్లో భారత పౌరసత్వాన్ని పొందకుండా నిరోధించే పూర్తి అధికారం భారత ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈ ప్రక్రియలో మొత్తంగా న్యాయపరమైన పద్ధతులదే (Due Process of Law) పైచేయి అని, చట్ట పరిధిలోనే నిర్ణయాలు జరగాలని తేల్చిచెప్పింది.
ప్రస్తుతానికి తాము సదరు 27 మంది పౌరసత్వాన్ని ధ్రువీకరించే అసలు ఆధారాలను నేరుగా పరిశీలించలేదని ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసును తిరిగి విచారించాలని ట్రైబ్యునళ్లను ఆదేశించింది. అయితే, ఈ ట్రైబ్యునళ్లు మరోసారి పూర్తిస్థాయి విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకునే వరకు బాధితులపై డిటెన్షన్ లేదా దేశం దాటించడం వంటి ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.




