Assam Floods : అస్సాంలో దారుణ పరిస్థితులు.. 78కి చేరిన మరణాలు.. 3 లక్షల మందిపైగా ఎఫెక్ట్..
Assam Floods : అస్సాం రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. శివసాగర్, గోలాఘాట్ జిల్లాల్లో తాజాగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఈ
Assam-Floods
Assam Floods : అస్సాం రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. శివసాగర్, గోలాఘాట్ జిల్లాల్లో తాజాగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఏడాది వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 78కి చేరుకుంది. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) విడుదల చేసిన తాజా హెచ్చరికల ప్రకారం.. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఇప్పటికీ 3 లక్షల మందికి పైగా ప్రజలు వరద నీటిలోనే చిక్కుకుని తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఏడు జిల్లాలపై తీవ్ర ప్రభావం.. చరైడియో పరిస్థితి విషమం
ప్రస్తుతం శివసాగర్, చరైడియో, గోలాఘాట్, జోర్హాట్, నగావ్, బిశ్వనాథ్ , కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. మొత్తం 21 రెవెన్యూ సర్కిళ్లు, 551 గ్రామాలు నీట మునిగాయి. సుమారు 21,523 హెక్టార్ల పంట పొలాలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. బాధిత జిల్లాల్లో చరైడియో అత్యంత తీవ్రంగా దెబ్బతింది, ఇక్కడ ఒక్క జిల్లాలోనే 1.37 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆ తర్వాతి స్థానాల్లో శివసాగర్ (84,600 మంది), జోర్హాట్ (49,911 మంది) ఉన్నాయి. మంగళవారంతో పోలిస్తే బాధితుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు.
కొనసాగుతున్న సహాయక చర్యలు.. 11 వేలకు పైగా మూగజీవాలు బలి
వరద బాధితుల కోసం ప్రభుత్వం భారీగా సహాయక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 71 పునరావాస కేంద్రాలలో 16,500 మందికి పైగా వసతి పొందుతుండగా, మరో 72,000 మందికి 30 సహాయ పంపిణీ కేంద్రాల ద్వారా ఆహారం, నిత్యావసరాలు అందిస్తున్నారు. మెడికల్, వెటర్నరీ టీమ్‌లతో పాటు వివిధ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఇక ఈ వరదల ధాటికి రహదారులు, ఇళ్లు, పాఠశాలలు ధ్వంసమవ్వడమే కాకుండా, 11,000 కంటే ఎక్కువ పశువులు కొట్టుకుపోయాయి.
గౌహతిలోనూ ఆగని అర్బన్ ఫ్లడ్డింగ్
నదులు పొంగిపొర్లుతుంటే, కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాలోని గౌహతి నగరంలో 'అర్బన్ ఫ్లడ్డింగ్' సమస్య తీవ్రంగా వేధిస్తోంది. పదుల సంఖ్యలో ఉన్న కాలనీలు నీట మునిగాయి. పడుంబరి, బోరాగావ్, లచిత్ నగర్, జూ రోడ్, రుక్మిణిగావ్, అనిల్ నగర్, హాతిగావ్ వంటి ప్రాంతాల్లో వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి.
అండగా ఉంటామని కేంద్రం హామీ.. సహాయక చర్యల్లో సైన్యం
అస్సాం వరద పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వర్షాలు తగ్గినా బురద, కొండచరియల వల్ల ఇళ్లకు తిరిగి వెళ్లలేని స్థితిలో ప్రజలు ఉన్నారని సీఎం తెలిపారు. అలాగే, వరద బాధితుల రుణాలపై ప్రత్యేక మినహాయింపులు ఇచ్చేందుకు బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు, ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ సైతం పర్యటించి, సైన్యం అందిస్తున్న సహాయక చర్యలను సమీక్షించారు.
మరో మూడు రోజులు భారీ వర్షాల హెచ్చరిక
వరద నీరు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్న తరుణంలో వాతావరణ శాఖ (IMD) మరో బాంబు పేల్చింది. జూలై 30 నుండి ఆగస్టు 1 వరకు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తిన్సుకియాతో పాటు నాగాలాండ్‌లోని పలు జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేశారు. ఈ వర్షాల వల్ల మళ్లీ హఠాత్తుగా వరదలు (Flash Floods), కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరింది.




