IAF AN-32 Crash : ల్యాండింగ్‌లోనే కుప్పకూలిన IAF AN-32.. అసోంలో విషాదం
IAF AN-32 Crash : అసోంలోని జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో శనివారం (జూన్ 13) ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారత వాయుసేనకు చెందిన ఒక AN-32 రవాణా..
IAF AN-32 Crash
IAF AN-32 Crash : అసోంలోని జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో శనివారం (జూన్ 13) ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారత వాయుసేనకు చెందిన ఒక AN-32 రవాణా విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని భారత వాయుసేన (IAF) అధికారికంగా ధృవీకరించింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, వారి ప్రస్తుత పరిస్థితి ఏమిటనే వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
ల్యాండింగ్ సమయంలోనే ప్రమాదం
అసోంలోని రౌరియా విమానాశ్రయం (జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్)లో దిగుతుండగా ఈ మిలిటరీ విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. రవాణా అవసరాల కోసం వినియోగించే ఈ AN-32 కార్గో విమానం, ఎయిర్‌బేస్‌లో దిగడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత దృష్ట్యా విమాన పైలట్ మరణించి ఉండవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్లు , విచారణ కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి భారత వాయుసేన ఇప్పటికే 'కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ'కి ఆదేశించింది.
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
సమాచారం అందిన వెంటనే వాయుసేన సిబ్బంది, స్థానిక ఎమర్జెన్సీ సర్వీసుల బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పరిస్థితిని అంచనా వేయడానికి, ప్రాంతాన్ని సురక్షితం చేయడానికి , బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించడానికి రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
గతంలోనూ AN-32 విమానాలకు ప్రమాదాలు
భారత వాయుసేనలో కీలక పాత్ర పోషించే AN-32 రవాణా విమానాలు గతంలో కూడా పలు ప్రమాదాలకు గురయ్యాయి. 2019 జూన్ 3న జరిగిన ఒక దురదృష్టకర సంఘటన ఇప్పటికీ అందరినీ కలిచివేస్తుంది. అప్పట్లో, 8 మంది సిబ్బంది, 5 మంది ప్రయాణికులు కలిపి మొత్తం 13 మందితో అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి అరుణాచల్ ప్రదేశ్‌లోని మెచుకాకు బయలుదేరిన AN-32 విమానం అదృశ్యమైంది.
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ విమానం రాడార్ సంకేతాలను కోల్పోయింది. భారత వాయుసేన, సైన్యం, నావికాదళం, ఇస్రో (ISRO) , పలు పౌర ఏజెన్సీలు కలిసి ఎనిమిది రోజుల పాటు దట్టమైన అడవుల్లో, ఎత్తైన పర్వత ప్రాంతాల్లో భారీ గాలింపు చర్యలు చేపట్టాయి. చివరకు జూన్ 11, 2019న అరుణాచల్ ప్రదేశ్‌లోని లిపో సమీపంలో సుమారు 12,000 అడుగుల ఎత్తులో విమాన శకలాలను గుర్తించారు. జూన్ 13న రెస్క్యూ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకోగా, అందులో ప్రయాణించిన 13 మందిలో ఎవరూ ప్రాణాలతో లేరని, అందరూ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారని నిర్ధారణ అయ్యింది. తాజాగా మరోసారి అదే తరహా ప్రమాదం చోటుచేసుకోవడం వాయుసేన వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.




