Army: ఆర్మీ జవాన్‌కు చలాన్ వేసింది..ఇప్పుడు చూడు ఎంత పనైందో..!

Army: అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో సీటు బెల్టు ధరించని ఆర్మీ వాహన డ్రైవర్‌కు జరిమానా విధించి, ఫోటో తీసిన మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Gagan kumar
Published on: 21 Nov 2026 10:21 AM IST
Army
X

Army: ఆర్మీ జవాన్‌కు చలాన్ వేసింది..ఇప్పుడు చూడు ఎంత పనైందో..!

Assam MVI Jorhat: చట్టం ముందు అందరూ సమానులే అంటారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే సామాన్యులకైనా, ప్రముఖులకైనా జరిమానా తప్పదు. కానీ విధి నిర్వహణలో భాగంగా నిబంధనలను కచ్చితంగా అమలు చేయబోయిన ఓ రవాణా శాఖ అధికారికి ఊహించని షాక్ తగిలింది.

సీటు బెల్టు ధరించని ఆర్మీ వాహన డ్రైవర్‌కు జరిమానా విధించి, ఫోటో తీసినందుకు అస్సాం రాష్ట్ర రవాణా శాఖకు చెందిన ఓ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

జోర్హాట్ జిల్లాలో ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ అధికారులు రహదారి భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఒక ఆర్మీ వాహనాన్ని గమనించిన మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, ఆ వాహనం నడుపుతున్న జవాన్ సీటు బెల్టు ధరించలేదని గుర్తించారు. వెంటనే నిబంధనల ప్రకారం సదరు ఆర్మీ సిబ్బందికి ట్రాఫిక్ చలాన్ విధించారు. అంతేకాకుండా, నిబంధనల ఉల్లంఘనకు ఆధారంగా ఉండాలనే ఉద్దేశంతో మొబైల్‌లో ఒక ఫోటో కూడా తీశారు.

ఆర్మీ వాహనాన్ని ఆపి జవాన్‌కు చలాన్ విధించడం, పైగా ఫోటో తీయడం అనే వ్యవహారం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో రవాణా శాఖ ఉన్నతాధికారులు తక్షణమే చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటన జరిగిన ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే సదరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

రహదారి భద్రతా నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాల్సిన ఒక అధికారి, తన బాధ్యతను నిర్వర్తించినందుకు సస్పెన్షన్‌కు గురికావడం ఇప్పుడు స్థానికంగానే కాకుండా, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలి కదా అని కొందరు అధికారికి మద్దతుగా నిలుస్తుంటే.. దేశ రక్షణలో ఉండే ఆర్మీ వాహనాల విషయంలో, సున్నితమైన భద్రతా అంశాల దృష్ట్యా ఫోటోలు తీయడం వంటి చర్యల వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా, ఒక చలాన్ వ్యవహారం ఏకంగా అధికారి ఉద్యోగంపై వేటు వేసే వరకు వెళ్లడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.