ISI Threat : ఆగస్టు 15 వేళ ఐఎస్‌ఐ కుట్రలు.. సరిహద్దుల్లో హై అలర్ట్.!
ISI Threat : దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలకు సిద్ధమవుతున్న వేళ, సరిహద్దు అవతల నుంచి పాకిస్థాన్ గూఢచార సంస్థ 'ఐఎస్‌ఐ' (ISI) వికృత కుట్రలకు
ISI Threat
ISI Threat : దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలకు సిద్ధమవుతున్న వేళ, సరిహద్దు అవతల నుంచి పాకిస్థాన్ గూఢచార సంస్థ 'ఐఎస్‌ఐ' (ISI) వికృత కుట్రలకు తెరతీస్తోంది. ఆగస్టు 15న మన భద్రతా దళాలు , నిఘా వర్గాల దృష్టి ప్రధానంగా ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్‌లలో జరిగే అధికారిక వేడుకలపైనే ఉంటుందని అంచనా వేస్తున్న ఐఎస్‌ఐ, ఆ సమయాన్ని అనుకూలంగా మార్చుకుని దాడులకు పాల్పడేందుకు యత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ ముప్పును తిప్పికొట్టేందుకు భారత్-పాకిస్థాన్, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద కేంద్ర ప్రభుత్వం , సరిహద్దు భద్రతా దళాలు (BSF) కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి.
ఐఎస్‌ఐ వ్యూహం.. ఈసారి చిన్న నగరాలే లక్ష్యం!
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అందించిన సమాచారం ప్రకారం.. ఐఎస్‌ఐ కేవలం జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల ద్వారానే కాకుండా, బంగ్లాదేశ్ సరిహద్దులను వాడుకుని కూడా ఉగ్రవాదులను దేశంలోకి జొరబడేలా ప్రణాళికలు రచిస్తోంది. ఢిల్లీ, శ్రీనగర్ వంటి ప్రధాన నగరాల్లో భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉండటంతో, భద్రతా నిఘా కాస్త తక్కువగా ఉండే ‘టూ-టైర్’ నగరాలను లక్ష్యంగా చేసుకుని విద్వేషం రెచ్చగొట్టాలని చూస్తోంది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) , బలూచిస్తాన్‌లలో అంతర్గత కల్లోలాలు, ప్రజల నిరసనలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న పాక్ యంత్రాంగం, తమ దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకు భారతదేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు లేదా దాడులు చేయాలని చూస్తున్నట్లు సరిహద్దు దాటిన నిఘా సంభాషణల ద్వారా స్పష్టమవుతోంది.
దృష్టి మళ్లించే కుట్రలు.. అప్రమత్తమైన ఐబీ
భద్రతా ఏజెన్సీల దృష్టిని మళ్లించేందుకు ఐఎస్‌ఐ కొన్ని అబద్ధపు హెచ్చరికలను (False Alarms) కూడా సృష్టిస్తోందని అధికారులు గుర్తించారు. ఢిల్లీ లేదా కాశ్మీర్‌లో పెద్ద దాడి జరుగుతోందనే సంకేతాలను ఉద్దేశపూర్వకంగా లీక్ చేస్తూ, దళాల దృష్టిని అక్కడ కేంద్రీకరించేలా చేయడం.. ఆ తర్వాత వేరొక ప్రాంతంలో దాడికి పాల్పడటం వారి అసలు వ్యూహంగా తెలుస్తోంది. అందుకే ఏ ఒక్క చిన్న ఇంటెలిజెన్స్ సమాచారాన్ని కూడా వదలకుండా నిఘా వర్గాలు అత్యంత క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి.
వెస్ట్రన్ బోర్డర్‌లో BSF 'ఆపరేషన్ అలర్ట్'
పాకిస్థాన్ వైపు నుంచి జరిగే ఎలాంటి కుట్రలైనా సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సరిహద్దు భద్రతా దళం పశ్చిమ సరిహద్దుల్లో 'ఆపరేషన్ అలర్ట్' ను ప్రారంభించింది. ఆగస్టు 10న ప్రారంభమైన ఈ ప్రత్యేక తనిఖీ ఆపరేషన్ ఆగస్టు 17 వరకు కొనసాగనుంది. ఈ ఆపరేషన్‌లో బిఎస్‌ఎఫ్ సీనియర్ అధికారులు నేరుగా పాల్గొంటూ సరిహద్దుల గుండా అక్రమ రవాణా, ఉగ్రవాదుల జొరబాట్లు జరగకుండా నిరంతర నిఘా , రౌండ్ ది క్లాక్ పెట్రోలింగ్‌ను తీవ్రతరం చేశారు.
బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 40 ఎస్‌ఐబీ యూనిట్లు
మరోవైపు బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా చొరబాట్లను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాల్లో దాదాపు 40 'సబ్‌సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరో' (SIB) యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో నెట్‌వర్క్‌లోనే ఇది అతిపెద్ద విస్తరణలలో ఒకటి. సున్నితమైన బంగ్లాదేశ్ సరిహద్దుల్లో శాశ్వత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి, చొరబాట్లు , తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి కుట్రలను తిప్పికొట్టడమే ఈ యూనిట్ల ప్రధాన లక్ష్యం.




