ఔరంగజేబు సమాధికి డెడ్‌లైన్ ఫిక్స్.. తేదీ సీక్రెట్
మహారాష్ట్ర రాజకీయంలో చారిత్రక అంశం కేంద్రంగా మరోసారి తీవ్ర వివాదం రాజుకుంది. ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఖుల్దాబాద్‌లో ఉన్న మొఘల్ చక్రవర్తి..
Aurangzeb Tomb
మహారాష్ట్ర రాజకీయంలో చారిత్రక అంశం కేంద్రంగా మరోసారి తీవ్ర వివాదం రాజుకుంది. ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఖుల్దాబాద్‌లో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించేందుకు ఇప్పటికే ముహూర్తం ఖరారైందని, ఆ నిర్ణయానికి ఒక డెడ్‌లైన్ కూడా ఉందని రాష్ట్ర మంత్రి నితేశ్ రాణే వ్యాఖ్యానించడం ప్రకంపనలు సృష్టిస్తోంది.
దేవేంద్ర ఫడ్నవీస్‌కే ఆ తేదీ తెలుసు..
ఛత్రపతి శంభాజీనగర్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నితేశ్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఔరంగజేబు సమాధిని తొలగించడానికి అవసరమైన ప్రణాళిక, గడువు ఇప్పటికే ఖరారయ్యాయి. అయితే ఆ తేదీ ఏంటనేది నేను ఇప్పుడు బయటపెట్టను. ముఖ్యమంత్రి దేవేન્દ્ર ఫడ్నవీస్‌కు ఆ వివరాలు తెలుసు. సరైన సమయంలో, అనుకూలమైన రోజే ఆ తీపి కబురును ఆయనే స్వయంగా ప్రకటిస్తారు" అని రాణే పేర్కొన్నారు. మహారాష్ట్ర గుర్తింపునకు ఔరంగజేబు సమాధితో ఎలాంటి సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
వివాదం కొత్తదేమీ కాదు.. ఏఎస్‌ఐ రక్షణలో స్మారకం
మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్ హిందూత్వ సంస్థలు, బీజేపీ నేతల నుంచి గతంలోనూ అనేకసార్లు వినపడింది. 2025 మార్చి సమయంలోనూ మంత్రి నితేశ్ రాణే ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అయితే చట్టపరంగా చూస్తే ఖుల్దాబాద్‌లోని ఈ సమాధి భారత పురావస్తు శాఖ (ASI) రక్షణలోని కేంద్ర సంరక్షిత స్మారక చిహ్నం. నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా లేదా ఆ జాబితా నుంచి తొలగించకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వమూ దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో ఈ సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.




