Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర ట్రస్ట్‌లో సంచలనం.. చంపత్ రాయ్ రాజీనామా ఆమోదం!

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో కానుకల దొంగతనం వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.

Arun Chilukuri
Published on: 6 July 2026 5:44 PM IST
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర ట్రస్ట్‌లో సంచలనం.. చంపత్ రాయ్ రాజీనామా ఆమోదం!
X

Ayodhya Ram Mandir: అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయంలో కానుకల దొంగతనం వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అత్యవసర, కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఆలయ పవిత్రత, భక్తుల నమ్మకానికి సంబంధించిన ఈ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. దొంగతనం వివాదం నేపథ్యంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రాలు చేసిన రాజీనామాలను ట్రస్ట్ అధికారికంగా ఆమోదించింది.

రామ మందిరంలో జరిగిన ఈ దొంగతనం ట్రస్ట్ సభ్యులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రామ భక్తులు, సాధారణ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ట్రస్ట్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ మాట్లాడుతూ.. "ఈ పాపంలో పాలుపంచుకున్న వారు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించబడతారు" అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ చోరీపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ జరుపుతోందని, సిట్ దర్యాప్తుపై తమకు పూర్తి నమ్మకం ఉందని ట్రస్ట్ పేర్కొంది. కాగా, చంపత్ రాయ్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసినప్పటికీ, ఆయన ట్రస్టీగా కొనసాగనున్నట్లు సమాచారం.

చంపత్ రాయ్ రాజీనామాతో ఖాళీ అయిన ప్రధాన కార్యదర్శి పదవిని భర్తీ చేసేందుకు ట్రస్ట్ కసరత్తు చేస్తోంది. ఈ రేసులో విశ్వ హిందూ పరిషత్ (VHP) అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజ్రంగ్ బగ్రా పేరు ముందు వరసలో ఉన్నట్లు తెలుస్తోంది. వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ (CA) అయిన బగ్రా, గతంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘నాల్కో’ (NALCO)కు చీఫ్‌గా పనిచేశారు. ఆయనకు ఉన్న సుదీర్ఘ ఆర్థిక, పరిపాలనా అనుభవం ట్రస్ట్ పనితీరును, పారదర్శకతను మరింత మెరుగుపరుస్తుందని పలువురు భావిస్తున్నారు.

మరోవైపు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ కానుకల దొంగతనం వ్యవహారం తీవ్ర రాజకీయ వివాదంగా మారింది. ఆలయ భద్రత, నిర్వహణలో అధికార బీజేపీ మరియు సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఘోరంగా విఫలమయ్యాయంటూ సమాజ్ వాదీ పార్టీ (SP) చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story