Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయ కానుకల దొంగతనం కేసు.. ఎట్టకేలకు 8 మంది పై ఎఫ్‌ఐఆర్ నమోదు
Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరం కానుకల దొంగతనం కేసులో 8 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా తీవ్రమైన సెక్షన్ల కింద యూపీ పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
Ayodhya Ram Mandir
Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరంలో భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల లెక్కింపులో జరిగినట్లుగా చెబుతున్న అక్రమాల వ్యవహారంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దొంగతనం, అక్రమాలకు సంబంధించి స్థానిక పోలీసులు అధికారికంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి అయిన కృష్ణమోహన్ ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు ఫైల్ అయింది. ఈ కేసులో మొత్తం 8 మందిని నిందితులుగా చేర్చారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఈ కఠిన చర్యలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
ఈ వివాదం తెరపైకి రాగానే యూపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ విచారణకు నేతృత్వం వహించిన లక్నో డివిజన్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ మంగళవారం (జూన్ 23) తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ కేసుపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. సిట్ విచారణ ద్వారా పాలేంటో నీళ్లేంటో తేలిపోతుందని, దేవుడి సొమ్మును కాజేసిన దోషులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ నివేదిక ఆధారంగానే పోలీసులు అత్యంత కఠినమైన జామీన్ రహిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మొత్తం 8 మంది పేర్లను స్పష్టంగా చేర్చారు. వారిలో రమాశంకర్ యాదవ్ అలియాస్ టిన్నూ (ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కి అత్యంత సన్నిహితుడు, డ్రైవర్), అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా, కరుణేష్ పాండే, మనీష్ యాదవ్, లవ్‌కుష్ మిశ్రా, రమా శంకర్ మిశ్రా, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి, విరాళాల లెక్కింపు ఇన్‌ఛార్జ్ అయిన సుభాష్ శ్రీవాస్తవ ఉన్నారు. అయితే ఈ ఎఫ్‌ఐఆర్‌లో రామమందిర ట్రస్ట్‌కు చెందిన కీలక సభ్యులైన చంపత్ రాయ్, అనిల్ మిశ్రా లేదా గోపాల్ రావు వంటి పెద్దల పేర్లు ఎక్కడా నమోదు కాలేదు.
పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. కేసు నమోదైన ఎనిమిది మందిలో ఆరుగురు వ్యక్తులు ఆలయ కానుకలను లెక్కించే క్యాషియర్లుగా పనిచేస్తున్నారు. సుభాష్ శ్రీవాస్తవ, టిన్నూ యాదవ్ ఈ డబ్బు లెక్కింపు బృందానికి ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరించారు. మిగిలిన ఆరుగురు నిందితులు ఈ లెక్కింపు ప్రక్రియతో నేరుగా సంబంధం ఉన్న ఉద్యోగులుగా గుర్తించారు. నిందితులలో ఒకరైన టిన్నూ యాదవ్ మేనల్లుడు మనీష్ యాదవ్ కూడా ఈ లెక్కింపు టీమ్‌లో సభ్యుడిగా ఉంటూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ విరాళాల చోరీకి సంబంధించి దర్యాప్తు సంస్థలకు కొన్ని కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కానుకలు, నగదు లెక్కింపు జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా, నిందితులు సమాచారాన్ని దాచడం, అక్రమాలకు పాల్పడటం వంటి కొన్ని అనుమానాస్పద దృశ్యాలు రికార్డ్ అయినట్లు సమాచారం. ఈ డిజిటల్ ఆధారాల ప్రకారమే సిట్ తన నివేదికను తయారు చేసింది.
ఈ కేసులో నిందితులపై భారతీయ న్యాయ సంహిత, అవినీతి నిరోధక చట్టం కింద అత్యంత కఠినమైన సెక్షన్లను పోలీసులు నమోదు చేశారు. అందులో:
* BNS సెక్షన్ 61: క్రిమినల్ కుట్ర (సామూహికంగా ప్లాన్ చేయడం)
* BNS సెక్షన్ 306: ఒక ఉద్యోగి లేదా సేవకుడి ద్వారా ఆస్తి చోరీకి పాల్పడటం
* BNS సెక్షన్ 316: నమ్మకద్రోహం (క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్)
* BNS సెక్షన్ 317: దొంగిలించబడిన ఆస్తిని తమ వద్ద ఉంచుకోవడం
* BNS సెక్షన్ 317(4): దొంగిలించబడిన సొమ్ముతో లావాదేవీలు జరపడం
* BNS సెక్షన్ 317(5): దొంగతనపు సొమ్మును దాచడానికి ఇతరులకు సహాయం చేయడం
ఈ కేసులో ట్రస్ట్ తరఫున ఫిర్యాదు చేసిన 73 ఏళ్ల కృష్ణమోహన్.. గతంలో భారత అటవీ సర్వీస్ అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తో కూడా బలమైన అనుబంధం ఉంది. ఈ కేసుపై స్థానిక పోలీసు అధికారులు స్పందిస్తూ.. ప్రస్తుతం నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా లోతైన దర్యాప్తు ముందుకు సాగుతుందని తెలిపారు. విచారణ సమయంలో సీసీటీవీ విశ్లేషణ, నిందితుల విచారణలో మరికొంత మంది పాత్ర లేదా పేర్లు బయటకు వస్తే, వారిపై కూడా చట్టప్రకారం కఠినమైన విధి విధానాల ద్వారా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.




