Ayodhya Ram Mandir : రాములోరి కానుకలకే కన్నం.. SIT విచారణలో సంచలనాలు.!

Ayodhya Ram Mandir : కలియుగంలో దేవుడికి కూడా రక్షణ కరువైందనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలి.. అయోధ్య రామమందిరంలో సాక్షాత్తూ ఆ రాములవారి..

G Krishna
Published on: 18 Jun 2026 11:28 AM IST
Ayodhya Ram Mandir
X

Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir : కలియుగంలో దేవుడికి కూడా రక్షణ కరువైందనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలి.. అయోధ్య రామమందిరంలో సాక్షాత్తూ ఆ రాములవారి కానుకల పెట్టెలకే ఎవరో ఘనాపాఠీలు కన్నం వేశారు. భక్తులు భక్తితో సమర్పించుకున్న నగదు, బంగారు నగలను ఎంచక్కా నొక్కేశారు. ఈ ఘోరంపై రంగంలోకి దిగిన ప్రత్యేక విచారణ బృందం (SIT) ఆలయ ప్రాంగణంలో మూడు రోజులు తలలు బద్దలు కొట్టుకుని వెతకగా.. దొంగల క్రియేటివిటీ చూసి దిమ్మతిరిగిపోయింది. ఎందుకంటే, దొంగతనం చేయడమే కాదు.. ఆ తర్వాత సాక్ష్యాధారాలు దొరకకుండా సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పక్కాగా ట్యాంపరింగ్ చేసేశారు కిలాడీలు..

రూ. 10 కోట్ల 'భద్రత'.. అంతా గుల్ల

సిట్ అధికారులు లెక్కలు తీస్తే తేలిందేంటంటే.. గత 11 నెలల్లోనే ఈ మందిరం సెక్యూరిటీ కోసం అక్షరాలా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట.. అంత బడ్జెట్ పెట్టి, అత్యాధునిక కెమెరాలు, సెక్యూరిటీ సిస్టమ్స్ పెట్టినా.. దొంగగారు మాత్రం 'షో మస్ట్ గో ఆన్' అన్నట్లు కానుకలు ఖాళీ చేసేశారు. పది కోట్లు పెట్టి పెంచిన భద్రతా వ్యవస్థ, దొంగల హస్తలాఘవం ముందు చేతులెత్తేయడంతో.. అసలు ఆ పది కోట్లు దేనికి ఖర్చు పెట్టారు బాసూ.. అని భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు.

దొంగలు ఎక్కడో లేరు.. లోపలే ఉన్నారా..

ఇంకేముంది.. సీసీటీవీ ఫుటేజ్ ఎడిట్ అయిందంటేనే కథ అర్థమైపోవట్లేదు..? కెమెరాలను కనిపెట్టుకుని ఉండే నిఘా సిబ్బంది, గేట్-కీపర్లు, ఐడీ పాస్‌లు ఇచ్చే మహానుభావుల వైపే ఇప్పుడు సిట్ అనుమానపు చూపులు చూస్తోంది. ఈ క్రమంలోనే రమాశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్‌తో పాటు మరికొందరు ఉద్యోగులను పిలిచి గంటల తరబడి క్లాస్ పీకుతున్నారు. "ఇంతకాలం కెమెరాల్లో ఏం చూశారు సామీ?" అని అధికారులు అడుగుతుంటే.. లోపల లూటీకి సహకరించిన సహృదయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

డబ్బులు లెక్కపెట్టింది బ్యాంకో.. 'దొంగల' ముఠానో

ఈ ముచ్చట పక్కనే పెడితే.. ఇక కానుకలు లెక్కించే వ్యవహారంలోనూ పెద్ద తమాషానే జరిగింది. ఈ లెక్కింపు ప్రక్రియలో మందిరానికి సంబంధించిన ట్రస్ట్ ఉద్యోగుల కంటే బ్యాంకు వాళ్లే ఎక్కువగా ఉన్నారట. మరి బ్యాంకోళ్ల కళ్లు కప్పి అంత సొమ్ము ఎలా మాయమైందో ఎవరికీ అర్థం కావడం లేదు. ట్రస్ట్ పెద్దలకు అత్యంత ఆప్తులుగా చలామణి అయిన కొందరు అధికారులు కూడా ఇప్పుడు సిట్ స్కామర్ పరిధిలోకి వచ్చారు. దొంగలు దొరకకుండా ఉండేందుకు వారి సర్వీస్ రికార్డులను కూడా దుమ్ము దులపడం ప్రారంభించారు అధికారులు.

200 మంది 'క్యూ'లో.. 125 మంది పూర్తి

ఈ దొంగతనంలో ఎవరెవరి హస్తం ఉందో తేల్చడానికి సిట్ ఏకంగా 200 మందితో కూడిన ఒక పెద్ద 'లిస్టు' తయారు చేసింది. ఇప్పటికే 125 మందిని పిలిచి గ్రిల్ చేసేశారు. కొందరికైతే మందిరం ప్రదక్షిణల కంటే సిట్ ఆఫీసు ప్రదక్షిణలే ఎక్కువైపోయాయి. ఒకరిద్దరు చిల్లర దొంగలు చేసిన పనా ఇది, లేక లోపల ఉన్న పెద్దలందరూ కలిసి నడిపించిన భాగోతమా అనేది తేలాల్సి ఉంది. విచారణ ముదిరే కొద్దీ ఇంకా ఎంతమంది భక్తుల ముసుగులు ఊడిపోతాయో చూడాలి..

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story