Maharashtra: 200 ఏళ్ల తర్వాత ఇంట్లో ఆడబిడ్డ జననం.. రథంపై గ్రాండ్ వెల్‌కమ్!

Maharashtra: మహారాష్ట్రలో 5 తరాల తర్వాత ఆడపిల్ల పుట్టడంతో ఆ కుటుంబం పండుగ చేసుకుంది. ప్రత్యేక రథంలో ఊరేగిస్తూ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 Sept 2026 6:25 AM IST
Maharashtra
X

Maharashtra: 200 ఏళ్ల తర్వాత ఇంట్లో ఆడబిడ్డ జననం.. రథంపై గ్రాండ్ వెల్‌కమ్!

Maharashtra: సమాజంలో ఇప్పటికీ కొందరు కొడుకులే కావాలని కోరుకుంటున్న తరుణంలో, ఐదు తరాల (దాదాపు 200 ఏళ్ల) నిరీక్షణ తర్వాత తమ ఇంట లక్ష్మీదేవిలా అడుగుపెట్టిన ఆడబిడ్డకు ఒక కుటుంబం బ్రహ్మరథం పట్టింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా, పార్లీకి చెందిన 'దహిఫలే' కుటుంబంలో దాదాపు రెండు శతాబ్దాలుగా కేవలం మగపిల్లలే జన్మిస్తూ వచ్చారు. ఇటీవల కల్పన-రిషికేష్ దహిఫలే దంపతులకు ఆడపిల్ల జన్మించడంతో ఆ కుటుంబ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఆ చిన్నారికి కుటుంబ సభ్యులు ఆప్యాయంగా ‘గార్గి’ అని నామకరణం చేశారు.


రథంపై ఊరేగింపు.. గ్రామంలో కోలాహలం:

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తల్లిని, నవజాత శిశువు గార్గిని ఇంటికి తీసుకువచ్చేందుకు దహిఫలే కుటుంబం ఎవరూ ఊహించని రీతిలో ఘనంగా ఏర్పాట్లు చేసింది. పూలతో శోభాయమానంగా అలంకరించిన ఒక ప్రత్యేక రథంలో తల్లి, బిడ్డలను కూర్చోబెట్టి, మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ ఊరంతా కోలాహలంగా ఊరేగించారు. ఊరేగింపు పొడవునా పటాకులు కాలుస్తూ, గ్రామంలో యువరాణికి స్వాగతం పలికినట్లుగా ఘనంగా వేడుకలు నిర్వహించారు.


లక్ష్మీదేవి స్వయంగా అడుగుపెట్టింది:

ఈ ఆనంద క్షణాలపై గార్గి తాత లింబాజీ దహిఫలే స్పందిస్తూ.. "మా కుటుంబంలో కుమార్తె పుట్టడం ఎంతో గొప్ప అదృష్టం. ఇన్నాళ్లుగా ఉన్న ఒకే ఒక్క లోటు నేటితో తీరిపోయింది" అని భావోద్వేగానికి గురయ్యారు. "మా ఇంట లక్ష్మీదేవి స్వయంగా జన్మించినట్లు అనిపిస్తోంది" అని పాప అమ్మమ్మ సురేఖ దహిఫలే హర్షం వ్యక్తం చేశారు. కుమార్తెలు తండ్రులకు ఎంతో ప్రత్యేకం అని, సమాజంలో ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షను పోగొట్టి, ఆడబిడ్డ జననం అనేది ఎంతో గర్వకారణమైన విషయమని తెలియజెప్పడానికే ఈ వేడుకను ఇంత వైభవంగా నిర్వహించినట్లు గార్గి తండ్రి రిషికేష్ తెలిపారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story