Bandi Sanjay: బెంగాల్ తీర్పుపై బండి సంజయ్ హాట్ కామెంట్స్
బెంగాల్ తీర్పుపై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమ చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Bandi Sanjay Slams Opposition, Strong Remarks on Bengal Verdict
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ విభజన వాదులకు ప్రజలు గుణపాఠం చెప్పారని ఆయన పేర్కొన్నారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతోందంటూ విమర్శలు చేసిన నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు.
బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లే పార్టీకి అధికారం దక్కిందని బండి సంజయ్ తెలిపారు. ఇదే తరహాలో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ లక్ష్యం త్వరలోనే నెరవేరుతుందని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారుల అంశంపై మాట్లాడుతూ, వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడం తప్పు కాదన్నారు. దేశాన్ని అస్థిరపర్చే వ్యక్తులకు ఓటు హక్కు ఎందుకు ఇవ్వాలనే ప్రశ్నించారు. బెంగాల్ ప్రజలు టీఎంసీకి గట్టి షాక్ ఇచ్చేలా తీర్పునిచ్చారని వ్యాఖ్యానించారు.
కరీంనగర్ ఘటనపై స్పందిస్తూ, ఆ ఘటనకు తాను బాధ్యత వహించి రాజీనామా చేయాలనడం హాస్యాస్పదమని అన్నారు. శాంతి భద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని, ఈ విషయంపై బీఆర్ఎస్‌కు అవగాహన లేకపోవడం విచారకరమని విమర్శించారు. ఇటువంటి నాయకులను ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్న ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా, పీఎంజే జువెలర్స్‌లో జరిగిన ఘటనలో గాయపడిన బాధితులను బండి సంజయ్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం బాధితులకు ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.




