Techie Fraud: కంపెనీ కార్డుతో రూ. 27 లక్షలు స్వాహా..కట్ చేస్తే మేనేజర్‌కే నగ్న ఫొటోలతో బ్లాక్ మెయిల్
Techie Fraud: ఆఫీస్ పనుల కోసం ఇచ్చిన క్రెడిట్ కార్డుతో రూ. 27 లక్షలు ఖర్చు చేసిన బెంగళూరు టెకీ. నిలదీసిన మేనేజర్‌కు అశ్లీల చిత్రాలు పంపుతూ బ్లాక్ మెయిల్ చేశాడు.
Techie Fraud: కంపెనీ కార్డుతో రూ. 27 లక్షలు స్వాహా..కట్ చేస్తే మేనేజర్‌కే నగ్న ఫొటోలతో బ్లాక్ మెయిల్
Techie Fraud: సాధారణంగా కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల సౌకర్యార్థం, ఆఫీస్ పనుల నిమిత్తం కార్పొరేట్ క్రెడిట్ కార్డులను ఇస్తుంటాయి. అయితే, బెంగళూరులోని ఒక ఐటీ ఉద్యోగి ఆ కార్డును తన సొంత ఏటీఎంలా భావించి ఏకంగా లక్షల రూపాయలు స్వాహా చేశాడు. అంతటితో ఆగకుండా, తన తప్పును పట్టుకున్న మేనేజర్‌నే బ్లాక్ మెయిల్ చేస్తూ వికృత చేష్టలకు దిగాడు.
అసలేం జరిగింది?
బెంగళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో పని చేస్తున్న సదరు ఉద్యోగికి ఆఫీస్ ఖర్చుల కోసం రూ. 2 లక్షల లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డును కంపెనీ ఇచ్చింది. కానీ, ఆ టెకీ అతి తెలివి ప్రదర్శించి, అక్టోబర్ 2023 నుండి జనవరి 2024 మధ్య కాలంలో ఏకంగా రూ. 27,01,139లను వ్యక్తిగత అవసరాలకు వాడేశాడు.
దొరికిపోయిన దొంగ..
ఈ భారీ వ్యత్యాసాన్ని గుర్తించిన కంపెనీ యాజమాన్యం, జనవరి 12న వివరణ కోరుతూ ఈమెయిల్ పంపింది. తాను దొరికిపోయానని అర్థం చేసుకున్న ఆ ఉద్యోగి, ఒక వింత కథను తెరపైకి తెచ్చాడు.చైనా, పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులు నన్ను బెదిరించారు.. అందుకే ఆ డబ్బు వాడాను అంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు.చివరకు తప్పు ఒప్పుకుని, వాడుకున్న డబ్బును మూడు వాయిదాల్లో తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు.
మేనేజర్‌కు బెదిరింపులు
కంపెనీ మానవతా దృక్పథంతో సమయం ఇచ్చినా, ఆ టెకీ మాత్రం తన వక్రబుద్ధిని వీడలేదు. డబ్బులు చెల్లించాల్సిన గడువు దగ్గర పడటంతో రూట్ మార్చాడు.తన మేనేజర్‌కు అశ్లీల చిత్రాలు పంపుతూ వేధించడం మొదలుపెట్టాడు. తానేదో బాధితుడిని అన్నట్లుగా నటిస్తూ.. ఒకవేళ ఒత్తిడి చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు.
చివరకు కటకటాల్లోకి..
బ్లాక్ మెయిలింగ్‌తో తప్పించుకోవచ్చని భావించిన ఆ టెకీకి కంపెనీ గట్టి షాక్ ఇచ్చింది. అతడి బెదిరింపులకు లొంగకుండా వెంటనే వర్తూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టెక్నాలజీ తెలిసినంత మాత్రాన చట్టం నుంచి తప్పించుకోలేరని, వృత్తి పట్ల నిజాయితీ లేకపోతే ఎంతటి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయినా చివరకు కటకటాల పాలు కావాల్సిందేనని ఈ ఘటన నిరూపించింది.




