బెంగాల్ పాలిటిక్స్‌లో ఊహించని ట్విస్ట్: రీపోలింగ్‌కు రెండు రోజుల ముందు పోటీ నుంచి తప్పుకున్న టీఎంసీ అభ్యర్థి..
Bengal: పశ్చిమ బెంగాల్ ఫల్టా రీపోలింగ్‌కు ముందు ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.
Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అత్యంత అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఫల్టా నియోజకవర్గంలో మే 21న రీపోలింగ్ జరగాల్సి ఉండగా.. రెండు రోజుల ముందే అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి కోలుకోలేని గండి పడింది. ఈ స్థానం నుంచి బరిలో ఉన్న టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటూ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అంతేకాదు, ఇకపై జీవితంలో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని సంచలన ప్రకటన చేశారు.
తన నిర్ణయం వెనుక గల కారణాన్ని జహంగీర్ ఖాన్ స్వయంగా వెల్లడించారు. బెంగాల్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత సువేందు అధికారి ఫల్టా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నారని, అందుకే తాను ఈ ఎన్నికల నుంచి తప్పుకొంటున్నానని తెలిపారు. తన నియోజకవర్గం ఎటువంటి గొడవలు, అల్లర్లు లేకుండా శాంతియుతంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
రీపోలింగ్‌కు ముందే తమ అభ్యర్థి చేతులెత్తేయడంపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) తీవ్రంగా స్పందించింది. జహంగీర్ ఖాన్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, ఇందులో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అయితే, దీని వెనుక బీజేపీ వేధింపులు, కుట్రలు ఉన్నాయని ఆరోపించింది.
మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఒక్క ఫల్టా నియోజకవర్గంలోనే తమ పార్టీకి చెందిన 100 మందికి పైగా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని టీఎంసీ మండిపడింది. తమ పార్టీ కార్యాలయాలను సైతం బీజేపీ నేతలు ధ్వంసం చేశారని, దీనిపై ఎన్నికల సంఘానికి (EC) ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఈ తీవ్ర ఒత్తిడి మరియు భయాందోళనల వల్లే కొందరు నేతలు క్షేత్రస్థాయి నుంచి తప్పుకుంటున్నారని, అయితే బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేసింది.




