బెంగళూరులో షాకింగ్ ఘటన.. గ్యాస్ సిలిండర్ డెలివరీ వేళ భారీ పేలుడు.. వైరల్‌గా వీడియో!

Bengaluru: బెంగళూరు మల్లేశ్వరంలో డెలివరీ చేస్తుండగా గ్యాస్ సిలిండర్‌కు మంటలు. డెలివరీ బాయ్ సమయస్ఫూర్తితో తప్పిన పెను ప్రమాదం, సీసీటీవీ వీడియో వైరల్.

Arun Chilukuri
Published on: 4 Nov 2026 3:56 PM IST
బెంగళూరులో షాకింగ్ ఘటన.. గ్యాస్ సిలిండర్ డెలివరీ వేళ భారీ పేలుడు.. వైరల్‌గా వీడియో!
X

బెంగళూరులో షాకింగ్ ఘటన.. గ్యాస్ సిలిండర్ డెలివరీ వేళ భారీ పేలుడు.. వైరల్‌గా వీడియో!

Gas Cylinder blast in Bengaluru: ఇంట్లో పనులు చేస్తుండగా నిత్యం అప్రమత్తంగా ఉండాలని పెద్దలు ఊరికే చెప్పరు. ఊహించని విపత్తు ఎదురైనప్పుడు మనం ఎంత వేగంగా, చాకచక్యంగా స్పందిస్తామనే దానిపైనే మన ప్రాణ రక్షణ ఆధారపడి ఉంటుంది. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో సరిగ్గా అలాంటి భయానక ఉదంతమే ఒకటి చోటుచేసుకుంది.

ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసేందుకు వచ్చిన ఒక కార్మికుడికి డోర్ ముందే ఊహించని చేదు అనుభవం ఎదురైంది. ఇంటి బయట సిలిండర్ దించగానే ఒక్కసారిగా దానికి నిప్పు అంటుకుని భారీగా మంటలు చెలరేగడం తీవ్ర భయాందోళన రేకెత్తించింది. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో చోటుచేసుకుంది. డెలివరీ బాయ్ ఎల్పీజీ సిలిండర్‌ను మోసుకొచ్చి ఒక ఇంటి గుమ్మం ముందు పెట్టాడు. అయితే అప్పటికే ఆ సిలిండర్ నుంచి స్వల్పంగా గ్యాస్ లీక్ అవుతుండటం, దానికి తోడు సదరు ఇంటి యజమాని ప్రహరీ గోడపై వెలిగించి ఉంచిన పూజా దీపం మంట దీనికి తగలడంతో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.

లీకేజీ కారణంగా మంటలు క్షణాల్లో పరిసర ప్రాంతమంతా వ్యాపించాయి. అయితే ఏమాత్రం ధైర్యం కోల్పోని డెలివరీ బాయ్ గట్టిగా కేకలు వేయడంతో ఇంట్లోని వారు వెంటనే బయటకు వచ్చి బకెట్లతో నీళ్లు అందించారు. డెలివరీ బాయ్ చాకచక్యంగా వ్యవహరిస్తూ నీళ్లతో పాటు తడి బట్టలను సిలిండర్‌పై వేసి నిమిషాల వ్యవధిలోనే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాడు. ప్రమాద తీవ్రతను గమనించిన పొరుగువారు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు.

సిలిండర్ పేలి ఉంటే చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసమై భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని, అయితే డెలివరీ బాయ్ సమయస్ఫూర్తితో ముప్పు తప్పిందని ఫైర్ అధికారులు అభినందించారు. ఈ భయానక దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.