భారత్ సమ్మిట్‌లో ఇటలీ నేత నినాదం.. రాహుల్ చప్పట్లు.. దేశ రాజకీయాల్లో కొత్త దుమారం

Bharat Summit: హైదరాబాద్‌లో జరిగిన 'భారత్ సమ్మిట్ 2026' వేదికగా ఇటలీ రాజకీయ నేత, యూరోపియన్ సోషలిస్టుల పార్టీ (PES) సెక్రటరీ జనరల్ గియాకోమో..

G Krishna
Published on: 15 Nov 2026 7:15 PM IST
Bharat Summit
X

భారత్ సమ్మిట్‌లో ఇటలీ నేత నినాదం.. రాహుల్ చప్పట్లు.. దేశ రాజకీయాల్లో కొత్త దుమారం

Bharat Summit: హైదరాబాద్‌లో జరిగిన 'భారత్ సమ్మిట్ 2026' వేదికగా ఇటలీ రాజకీయ నేత, యూరోపియన్ సోషలిస్టుల పార్టీ (PES) సెక్రటరీ జనరల్ గియాకోమో ఫిలిబెక్ కాంగ్రెస్ నినాదమైన 'ఓట్ చోర్, గడ్డి ఛోడ్' (Vote Chor, Gaddi Chhod) నినాదాన్ని ప్రతిధ్వనించడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ సదస్సులో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఎన్నికల జాబితా సవరణ ప్రచారాన్ని, రాహుల్ గాంధీని ఆ ఇటలీ నేత ప్రశంసించగా.. అక్కడ రాహుల్ గాంధీ నవ్వుతూ చప్పట్లు కొట్టడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ అంతర్గత విషయాల్లో విదేశీయుల జోక్యాన్ని అనుమతించడంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాత్రం దీనిని సమర్థించారు.

విదేశీ నేత వ్యాఖ్యలపై కిరణ్ రిజిజు ఆగ్రహం

భారత దేశాన్ని ఒక విదేశీయుడు అవమానిస్తుంటే ఎవరైనా నవ్వుతారా అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. విదేశీయుల చేతిలో దేశం అవమానానికి గురవుతున్నప్పుడు ఎవరైనా ఇలాగే నవ్వుతూ ఆనందిస్తారా అని ఎద్దేవా చేశారు.

భారత్ సమ్మిట్‌లో ఇటలీ నేత ఏమన్నారంటే?

ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో కాంగ్రెస్ నిర్వహించిన ఆందోళనలను ప్రస్తావిస్తూ గియాకోమో ఫిలిబెక్ ప్రసంగించారు. "ప్రతి డెమోక్రసీ ఆధారపడిన 'ఒక వ్యక్తి, ఒక ఓటు' అనే సూత్రాన్ని రాహుల్ గాంధీ సమర్థించారు. పారదర్శక ఓటర్ల జాబితా కోసం ఆయన చేస్తున్న పోరాటం అభినందనీయం" అని పేర్కొంటూ 'ఓట్ చోర్, గడ్డి ఛోడ్' (ఓట్ థీఫ్, లీవ్ యువర్ సీట్) అంటూ నినాదం చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, దానిని రక్షించడానికి రాహుల్ గాంధీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

బీజేపీ, బీఆర్ఎస్ తీవ్ర నిరసన.. దేశద్రోహంతో సమానమన్న కమల దళం

భారత దేశ అంతర్గత రాజకీయాలపై విదేశీ రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేయడం, కాంగ్రెస్ పార్టీ వాటిని ప్రోత్సహించడంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు. సొంత దేశంలో ఇలాంటి నినాదాలు చేయించడానికి మనుషులు దొరకకే కాంగ్రెస్ విదేశీయులను ఆశ్రయిస్తోందని బీజేపీ సీనియర్ నేత షాహనవాజ్ హుస్సేన్ విమర్శించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు స్పందిస్తూ.. మన దేశ ప్రజాస్వామ్యాన్ని విదేశీ నేతలు ఎగతాళి చేస్తుంటే చూసి ఆనందించడం, చప్పట్లు కొట్టడం దేశద్రోహంతో సమానమని మండిపడ్డారు. రాహుల్ గాంధీ విదేశీ మాస్టర్ల చేతిలో కీలుబొమ్మలా మారుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత కార్తీక్ ఇంద్ర రెడ్డి కూడా కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు.

ఇటలీ నేత వ్యాఖ్యలను సమర్థించిన సంజయ్ రౌత్

మరోవైపు ఇటలీ నేత వ్యాఖ్యలపై బీజేపీ చేస్తున్న విమర్శలను శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఖండించారు. ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో సన్నిహితంగా ఉండొచ్చని, కానీ ఒక ఇటాలియన్ రాజకీయ నేత మాత్రం మన దేశం గురించి మాట్లాడకూడదా అని ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, ఇది మానవ హక్కులకు సంబంధించిన విషయమని ఆయన పేర్కొన్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.