Building Collapse: అర్ధరాత్రి కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. నిద్రలోనే ఆరుగురి..!

Bhiwandi Building Collapse: మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి వేళ ఘోర ప్రమాదం సంభవించింది. ఒక నాలుగు అంతస్తుల నివాస

G Krishna
Published on: 31 July 2026 10:29 AM IST
bhiwandi building collapse
X

bhiwandi building collapse

Bhiwandi Building Collapse: మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి వేళ ఘోర ప్రమాదం సంభవించింది. ఒక నాలుగు అంతస్తుల నివాస భవనం అకస్మాత్తుగా కుప్పకూలిన ఘటనలో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరొక చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద సమయంలో భవనంలో చేపడుతున్న మరమ్మతు పనుల్లో ఉన్న కూలీలతో పాటు కొందరు నివాసితులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు.

రాత్రి 9 గంటలకే వింత శబ్దాలు.. అప్రమత్తమైన స్థానికులు

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భవనం నుంచి పెద్దగా శబ్దాలు రావడం, గోడలకు బిటలు వారడం కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించి, భవనంలో ఉన్న చాలా కుటుంబాలను ఖాళీ చేయించడం మొదలుపెట్టారు. అయితే ఇంకా కొందరు ఇళ్ల నుంచి బయటకు వస్తున్న సమయంలోనే, రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఆ భవనంలోని 'బి' వింగ్ ఒక్కసారిగా నేలమట్టమైంది.

మేం బయటకు వచ్చిన కొద్ది నిమిషాలకే క్రాష్..

భివాండీ-నిజాంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ అరవింద్ ఘోగారే మాట్లాడుతూ, భవనం దెబ్బతిన్నదనే సమాచారం రాగానే తమ బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నామని తెలిపారు. తాము లోపలికి వెళ్లి చాలామందిని ఖాళీ చేయించామని, కొందరు మహిళలు భోజనం చేసి వస్తామని కాస్త ఆలస్యం చేశారని పేర్కొన్నారు. అయితే అక్కడ అక్రమంగా మరమ్మతు పనులు చేస్తున్న కూలీలు మాత్రం బయటకు రాలేదని, ప్రజలను బయటకు తీసుకువచ్చిన కొన్ని నిమిషాల్లోనే భవనం కూలిపోయిందని ఆయన వెల్లడించారు.

విస్తృతంగా సహాయక చర్యలు.. ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి..

సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), థానే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (TDRF), స్థానిక ఫైర్ బ్రిగేడ్ , పోలీసులు హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటివరకు శిథిలాల నుంచి ఆరు మృతదేహాలను వెలికితీశారు. వీరంతా మరమ్మతు పనుల్లో పాల్గొన్న కూలీలని భావిస్తున్నారు. మరొక గాయపడిన బాలుడితో సహా ఏడుగురిని సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలంలో స్నిఫ్ఫర్ డాగ్స్, 4 ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులు, జేసీబీ పరికరాలతో శిథిలాలను తొలగించే పనులు వేగవంతంగా సాగుతున్నాయి. కేవలం పదేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనాన్ని మున్సిపల్ అధికారులు ఇప్పటికే ప్రమాదకరమైనదిగా ప్రకటించారు. ప్రమాద సమయంలో అక్కడ అనుమతి లేకుండా రిపేర్ పనులు జరుగుతున్నట్లు గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వీలైనంత త్వరగా కాపాడేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story