Kidnapping Case : విద్యార్థే విలన్.. ఐఏఎస్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కిడ్నాప్.. రూ.1.89 కోట్లు దోపిడీ
Kidnapping Case : భోపాల్‌లో ఐఏఎస్ కోచింగ్ డైరెక్టర్ శుభ్ర రంజన్ కిడ్నాప్ ఉదంతం. పాత విద్యార్థి గన్ పాయింట్‌లో రూ. 1.89 కోట్లు కాజేసి చిక్కాడు.
Kidnapping Case
Kidnapping Case : భోపాల్‌లో అత్యంత సంచలనం సృష్టించిన ఒక కిడ్నాప్ డ్రామా వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా పేరున్న ఒక ప్రముఖ ఐఏఎస్ (IAS) కోచింగ్ సెంటర్ డైరెక్టరును పట్టపగలే కిడ్నాప్ చేసి, రెండు రోజుల పాటు బంధించి, ఏకంగా కోట్లాది రూపాయలు వసూలు చేశారు. సినిమా కథను తలపించేలా సాగిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో అసలు నిందితుడు మరెవరో కాదు.. అదే కోచింగ్ సెంటర్లో చదువుకున్న ఒక పాత విద్యార్థి కావడం గమనార్హం. ఈ ఘోరానికి పాల్పడిన ప్రధాన నిందితుడు ప్రియాంక్ శర్మ, శుభ్ర రంజన్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో పాత విద్యార్థి. అంతేకాదు, భోపాల్‌లో అదే సంస్థకు సంబంధించిన ఫ్రాంచైజీని కూడా ఇతనే నడుపుతున్నాడు. కొత్త బ్రాంచ్ ప్రారంభం గురించి, ఒక పెద్ద సెమినార్ నిర్వహణ గురించి చర్చించాలని నమ్మబలికి డైరెక్టర్ శుభ్ర రంజన్‌ను ఢిల్లీ నుంచి భోపాల్‌కు రప్పించాడు. విమానాశ్రయం నుంచి ఆమెను హోటల్‌కు తీసుకెళ్తానని చెప్పి, నేరుగా బాగ్ సెవానియా ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌కు తీసుకెళ్లి బంధించాడు.
ఆ ఫ్లాట్‌లో ప్రియాంక్ తన అనుచరులతో కలిసి శుభ్ర రంజన్‌ను రెండు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశాడు. తుపాకీని ఆమె నెత్తిపై పెట్టి బెదిరించి, ఆమె బ్యాంకు ఖాతాల నుంచి సుమారు రూ.1.89 కోట్లను వివిధ ఖాతాలకు ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. అంతటితో ఆగకుండా, ఆమెను భవిష్యత్తులో బ్లాక్ మెయిల్ చేయడానికి ఒక అభ్యంతరకర వీడియోను కూడా రికార్డ్ చేశారు. ఈ రెండు రోజులు ఆమెకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేసి నరకం చూపించారు.
శుభ్ర రంజన్ ఫిర్యాదు చేసిన వెంటనే భోపాల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు గాలించి ప్రధాన నిందితుడు ప్రియాంక్ శర్మతో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. పోలీసులు వెంటనే బ్యాంకు అధికారులతో మాట్లాడి, నిందితులు ట్రాన్స్‌ఫర్ చేసుకున్న రూ.1.89 కోట్ల మొత్తాన్ని హోల్డ్ (ఫ్రీజ్) చేయించారు. దీనివల్ల ఆ భారీ మొత్తం తిరిగి బాధితురాలికి దక్కే అవకాశం కలిగింది.
పాత గొడవలే కారణమా?
ప్రియాంక్ శర్మకు, శుభ్ర రంజన్‌కు మధ్య గతంలో కొన్ని ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సంస్థ ఫ్రాంచైజీ వ్యవహారాల్లో వచ్చిన గొడవల నేపథ్యంలోనే ప్రియాంక్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఐఏఎస్ అభ్యర్థులకు పాఠాలు చెప్పే డైరెక్టరుకే ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం భోపాల్‌లో పెద్ద చర్చకు దారితీసింది.




