Lake Burst: భూటాన్‌లో కట్టలు తెంచుకున్న సరస్సు.. అస్సాం, బెంగాల్‌కు వరద ముప్పు
Lake Burst: భూటాన్‌లో షింటాఫూ గ్లేషియల్ సరస్సు పగిలిపోవడంతో అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు భారీ వరద ముప్పు పొంచివుంది.
Bhutan Glacial Lake Burst
Lake Burst: భూటాన్‌లో చోటుచేసుకున్న ప్రకృతి వైపరీత్యం భారత సరిహద్దు రాష్ట్రాలను కలవరపెడుతోంది. భూటాన్‌లోని గసా జిల్లాలో ఉన్న ప్రసిద్ధ షింతాఫూ గ్లేషియల్ సరస్సు ఒక్కసారిగా పగిలిపోయింది. దీనివల్ల భారీగా నీరు దిగువ ప్రాంతాలకు ఉప్పెనలా దూసుకొస్తోంది. ఈ ప్రమాదం కారణంగా భారత్‌లోని అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. సంకోష్ నది నీటిమట్టం ఒక్కసారిగా అసాధారణ రీతిలో పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.
భూటాన్‌లో షింతాఫూ సరస్సు ఉప్పెన
భూటాన్‌లోని పునాత్సంగ్చూ నది బేసిన్లో ఉన్న షింతాఫూ సరస్సు వకిలా పర్వతం క్రింద ఉంది. భూటాన్ ప్రభుత్వం ప్రమాదకరమైనదిగా గుర్తించిన 17 సరస్సులలో ఇది ఒకటి. గురువారం సాయంత్రం ఈ సరస్సు ఆకస్మికంగా పగిలిపోవడంతో భారీగా నీరు బయటికి వచ్చింది. ఈ నది భారత్‌లో ప్రవేశించిన తర్వాత సంకోష్ నదిగా పిలుస్తారు. ఈ వరద నీరు కేవలం ఆరు నుంచి ఎనిమిది గంటల్లోనే భారత్-భూటాన్ సరిహద్దు ప్రాంతాలకు చేరుకునే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అస్సాం, బెంగాల్‌లలో హైఅలర్ట్
ఈ ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది. అస్సాంలోని ధుబ్రి జిల్లాతో పాటు ఉత్తర బెంగాల్‌లోని డార్జిలింగ్ కొండలు, అలీపుర్దుఆర్, జల్పాయ్గుడి జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా సంకోష్ నది పరివాహక ప్రాంతాలైన తుఫాన్‌గంజ్, బక్సీర్హాట్ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దించారు. నది ఒడ్డున సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని నేతల విజ్ఞప్తి
పశ్చిమ బెంగాల్ వన మంత్రి, కుమార్గ్రామ్ ఎమ్మెల్యే మనోజ్ కుమార్ ఉరావ్ ప్రజలనుద్దేశించి ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశారు. రాబోయే ఒకటి రెండు గంటల్లో నది నీటిమట్టం భారీగా పెరుగుతుందని హెచ్చరించారు. నది ఒడ్డున నివసించే ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక యంత్రాంగానికి సహకరించి ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు.
పెను ప్రమాదంగా మారిన జీఎల్ఓఎఫ్
హిమనినదాలు కరిగి ఏర్పడిన సరస్సుల సహజ కట్టడాలు బలహీనపడి అకస్మాత్తుగా నీరు బయటికి రావడాన్ని జీఎల్ఓఎఫ్ అంటారు. దీనివల్ల కొండ ప్రాంతాల నుంచి నీరు ఉధృతంగా ప్రవహించి భారీగా మృత్తికను, బండరాళ్లను కిందికి తీసుకువస్తుంది. దీనివల్ల రోడ్లు, వంతెనలు, నివాస ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అధికార యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నది పరివాహక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చే పనిలో నిమగ్నమైంది.




