Mamata Banerjee: మమతకు షాక్.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన టీఎంసీ ఎంపీ సుష్మితా దేవ్!

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్‌ తన పదవికి రాజీనామా చేశారు.

Arun Chilukuri
Published on: 10 Jun 2026 1:43 PM IST
Mamata Banerjee:
X

Mamata Banerjee: మమతకు షాక్.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన టీఎంసీ ఎంపీ సుష్మితా దేవ్!

Mamata Banerjee: తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి జాతీయ స్థాయిలో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఫైర్‌బ్రాండ్ లీడర్, రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్‌ (Sushmita Dev) తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడైన సీనియర్ నేత సుఖేందు శేఖర్‌ రాయ్‌ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తరుణంలో.. ఇప్పుడు సుష్మితా దేవ్ కూడా అదే బాట పట్టడం టీఎంసీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

బుధవారం నాడు సుష్మితా దేవ్ తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌ (ఉపరాష్ట్రపతి) కి పంపించారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాల్సిందిగా ఆ లేఖలో ఆమె విజ్ఞప్తి చేశారు. టీఎంసీలో అతి తక్కువ కాలంలోనే జాతీయ అధికార ప్రతినిధిగా, ఆపై రాజ్యసభ ఎంపీగా చక్రం తిప్పిన సుష్మిత.. అకస్మాత్తుగా పార్టీని వీడటం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజీనామా ప్రకటించిన వెంటనే ఢిల్లీ వేదికగా ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సుష్మితా దేవ్ ఢిల్లీలో అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ కీలక నేత హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో ఆమె త్వరలోనే కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ఊహాగానాలు దేశ రాజధానిలో జోరందుకున్నాయి.

సుష్మితా దేవ్ అస్సాం కాంగ్రెస్‌ సీనియర్ దిగ్గజ నేత సంతోష్‌ మోహన్‌దేవ్ కుమార్తె. గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున అస్సాంలోని సిల్చార్ నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎంపీగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత, కాంగ్రెస్ నాయకత్వంతో విభేదించి 2021లో మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీలో చేరారు. బెంగాల్ వెలుపల (ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో) టీఎంసీని బలోపేతం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆమె అస్సాం సీఎంను కలవడంతో, సొంత రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకే బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story