Stampede: అశోక్‌ధామ్ ఆలయంలో విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురు భక్తుల మృతి!

Stampede: బీహార్‌లోని లఖిసరాయ్ అశోక్‌ధామ్ శివాలయంలో శ్రావణ సోమవారం నాడు భారీ తొక్కిసలాట జరిగింది.

Arun Chilukuri
Published on: 17 Aug 2026 10:40 AM IST
Stampede
X

Stampede: అశోక్‌ధామ్ ఆలయంలో విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురు భక్తుల మృతి!

Stampede: బీహార్‌లోని లఖిసరాయ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రసిద్ధ అశోక్‌ధామ్ శివాలయంలో సోమవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

పవిత్ర శ్రావణ మాసం సోమవారం కావడంతో అశోక్‌ధామ్ ఆలయానికి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. సరిగ్గా అదే సమయంలో భక్తుల రద్దీ మధ్యలో ఉన్న ఒక ఎలక్ట్రిక్ వైర్ ఉన్నట్టుండి తెగిపడింది. దీంతో విద్యుత్ షాక్ కొడుతుందేమోనన్న తీవ్ర భయాందోళనతో భక్తులు ఒక్కసారిగా బయటకు పరిగెత్తేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బారికేడ్లు కూలిపోవడంతో తీవ్ర తొక్కిసలాట జరిగి, ఒకరిపై ఒకరు పడిపోయారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జిల్లా యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన భక్తులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన ఉచిత వైద్యాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.

లఖిసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ వివరణ:

"శ్రావణ సోమవారం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు వస్తారని ఊహించి ఏర్పాట్లు చేశాం. అయితే, భయాందోళనకు గురై భక్తులు ఒకేసారి పరిగెత్తడంతో బారికేడ్లు పడిపోయి ఈ ప్రమాదం జరిగింది. వైర్ తెగిపడటమే దీనికి ప్రాథమిక కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు విచారణ అనంతరం ధ్రువీకరిస్తాం."

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story