Bankipur Bypoll Results: బిహార్ ఉపఎన్నికల్లో సంచలనం.. బీజేపీ కోట 'బాంకీపూర్'లో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం!

Bankipur Bypoll Results: బిహార్‌లోని బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ బీజేపీ అభ్యర్థిపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Arun Chilukuri
Published on: 3 Aug 2026 2:24 PM IST
Bankipur Bypoll Results
X

Bankipur Bypoll Results: బిహార్ ఉపఎన్నికల్లో సంచలనం.. బీజేపీ కోట 'బాంకీపూర్'లో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం!

Bankipur Bypoll Results: మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ బిహార్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో బోణీ కొట్టే దిశగా దూసుకుపోతున్నారు. బీజేపీకి బలమైన కోటగా భావించే పాట్నాలోని బాంకీపూర్ అసెంబ్లీ స్థానంలో 14 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ప్రశాంత్ కిషోర్ దాదాపు 8,000 ఓట్ల స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

14వ రౌండ్ ముగిసేసరికి ప్రశాంత్ కిషోర్‌కు 28,201 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాకు 20,420 ఓట్లు వచ్చాయి. ఆర్‌జేడీ అభ్యర్థి రేఖా గుప్తా 6,142 ఓట్లతో మూడో స్థానంలో వెనుకబడి ఉన్నారు. 1995 (అప్పట్లో పాట్నా వెస్ట్) నుంచి ఇక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్న బీజేపీకి ఈ ఫలితం ఊహించని షాక్‌గా మారింది.

పాట్నాలోని ఎన్ కాలేజ్ కేంద్రంలో సోమవారం ఉదయం 8 గంటలకు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 26 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, విజేతను తేల్చేందుకు 31 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికవ్వడంతో బాంకీపూర్ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. జులై 30న జరిగిన పోలింగ్‌లో 34.30 శాతం ఓటింగ్ నమోదైంది.

మరోవైపు ఓట్ల లెక్కింపునకు కొద్దిగంటల ముందు ప్రశాంత్ కిషోర్ పాట్నా పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రచారకర్తలను చట్టవిరుద్ధంగా నిర్బంధించి, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు పోలీసులు ప్రయత్నించారని విమర్శించారు. దీనిపై ఎన్నికల కమిషన్‌తో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. "పిల్లిని నిలబెట్టినా, కుక్కను నిలబెట్టినా గెలుస్తామన్న బీజేపీ ధీమాను ఈ ఎన్నికల ఫలితాలతో ప్రజలు తుడిచిపెట్టేస్తారు" అని ప్రశాంత్ కిషోర్ ధీమా వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story