Bihar BPSC: భగ్గుమన్న స్టూడెంట్స్.. బ్యారికేడ్లు బద్దలు.. పాట్నాలో టెన్షన్!
Bihar BPSC: బీహార్‌లో 70వ BPSC పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన మంగళవారం ఉద్రిక్తంగా మారింది.
Bihar BPSC: భగ్గుమన్న స్టూడెంట్స్.. బ్యారికేడ్లు బద్దలు.. పాట్నాలో టెన్షన్!
Bihar BPSC: బీహార్‌లో 70వ BPSC పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన మంగళవారం ఉద్రిక్తంగా మారింది. పాట్నాలోని గాంధీ మైదాన్ నుంచి రాజ్‌భవన్ వైపు భారీ సంఖ్యలో విద్యార్థులు మార్చ్ చేపట్టారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా బలగాలను మోహరించి బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే కొందరు విద్యార్థులు బ్యారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించారు. పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
సీఎం ఇంటి ముట్టడికి విద్యార్థుల యత్నం
విద్యార్థులు రాజ్‌భవన్ వైపు మార్చ్ చేస్తూ మార్గమధ్యంలో ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తొలగించారు. కొందరు సీఎం నివాసాన్ని ఘెరావ్ చేసేందుకు కూడా ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు తేల్చి చెప్పారు. ఈ ఆందోళనతో బీహార్‌లో రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్స్ ఆలస్యం, పేపర్ లీక్స్, పరీక్షల నిర్వహణలో పారదర్శకత వంటి అంశాలు మరోసారి చర్చకు వచ్చాయి.
దాదాపు అన్ని డిమాండ్లు పరిష్కరించాం: ప్రభుత్వం
విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని బీహార్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మిథిలేశ్ తివారీ తెలిపారు. విద్యార్థులు లేవనెత్తిన దాదాపు అన్ని సమస్యలను పరిష్కరించామని చెప్పారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే విద్యార్థులు ప్రభుత్వంతో నేరుగా చర్చించవచ్చని, తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అన్నారు. అయితే ప్రభుత్వం తమ డిమాండ్లన్నింటినీ పరిష్కరించలేదని విద్యార్థులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎగ్జామ్ పేపర్ లీక్స్, రిక్రూట్‌మెంట్ ఆలస్యం, TRE-4 పరీక్ష నిర్వహణపై సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయని అంటున్నారు.
18 ఏళ్లుగా లైబ్రేరియన్ పోస్టుల భర్తీ లేదు..
విద్యార్థి నేత వికాస్ భట్ మాట్లాడుతూ.. బీహార్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. వరుసగా ఎగ్జామ్ పేపర్ లీక్స్ జరుగుతున్నా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. లైబ్రేరియన్ పోస్టుల రిక్రూట్‌మెంట్ 18 ఏళ్లుగా జరగలేదని, ఇంకా ఎంతకాలం ఎదురుచూడాలని ప్రశ్నించారు. BSSC ద్వారా ప్రకటించిన మూడు రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్‌కు కూడా మూడేళ్లు గడిచినా ఎగ్జామ్ డేట్స్ ప్రకటించలేదని అన్నారు.
70వ BPSC ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలంటూ డిమాండ్
70వ BPSC పరీక్షలో అక్రమాలు, పేపర్ లీక్ ఆరోపణలు వచ్చాయని, అందుకే ఆ పరీక్షను క్యాన్సిల్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు TRE-4 పరీక్షను రెండు దశల్లో నిర్వహించాలన్న ప్రతిపాదనను కూడా విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే దశలో TRE-4 ఎగ్జామ్ నిర్వహించాలని కోరుతున్నారు. అలాగే TRE-4 అధికారిక నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
TRE-4పై స్పష్టత ఇవ్వాలి: కాంగ్రెస్
ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ మాట్లాడుతూ.. TRE-4 ఎగ్జామ్‌ను తప్పనిసరిగా సింగిల్ స్టేజ్‌లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. నెగెటివ్ మార్కింగ్‌ను తొలగించాలని కోరారు. BPSC, BSSC, సబ్-ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పలు సమస్యలపై కూడా ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని అన్నారు. సీఎం విద్యార్థి ప్రతినిధులతో నేరుగా చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం సీరియస్: JDU
విద్యార్థులు, జాబ్ సీకర్స్ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకుంటోందని JDU నేత శ్రవణ్ కుమార్ తెలిపారు. నిబంధనలు, చట్టాల ప్రకారమే రిక్రూట్‌మెంట్లు జరుగుతున్నాయని చెప్పారు. 2025 నుంచి 2030 మధ్య బీహార్‌లో కోటి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. యువత ప్రతిపక్షాల మాటలకు ప్రభావితం కాకుండా ఓపికగా ఉండాలని సూచించారు.
తేజస్వి యాదవ్ లేఖ
ఇదిలా ఉండగా బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ సీఎం సమ్రాట్ చౌదరికి లేఖ రాశారు. విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోకుండా ఉండొద్దని, వారితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరారు. TRE-4ను రాష్ట్రవ్యాప్తంగా ఒకే దశలో నిర్వహించాలని, BPSC సివిల్స్ మెయిన్స్, ఇంటర్వ్యూల్లో హిందీ మాట్లాడే అభ్యర్థుల పట్ల వివక్ష లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో పూర్తి ట్రాన్స్‌పరెన్సీ ఉండాలని కోరారు.
నెలకు ఒకసారి ‘విద్యార్థి సహాయ శిబిరాలు’
విద్యార్థుల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు బీహార్ ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘విద్యార్థి సహాయ శిబిరాలు’ పేరుతో ప్రతి నెలా క్యాంపులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే తమ ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో బీహార్‌లో BPSC, BSSC, TRE-4 రిక్రూట్‌మెంట్ వ్యవహారం మరింత హాట్ టాపిక్‌గా మారింది.




