Bihar Train Fire : స్టేషన్‌లోనే రైలు బోగీకి మంటలు.. పూర్తిగా దగ్ధం..!
Bihar Train Fire
Bihar Train Fire : బీహార్‌లోని సహర్సా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఒక భారీ రైలు ప్రమాదం తప్పింది. సమస్తిపూర్ నుంచి సహర్సా వెళ్తున్న ప్యాసింజర్ రైలు (నంబర్: 63344) సిమ్రీ బఖ్తియార్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. అలర్ట్ అయిన ప్రయాణికులు, రైల్వే అధికారులు వెంటనే స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అందరూ క్షేమంగా బయటపడ్డారు.
భయాందోళనలో పరుగులు తీసిన ప్రయాణికులు
ఉదయం సుమారు 3:40 గంటల సమయంలో రైలు సిమ్రీ బఖ్తియార్‌పూర్ స్టేషన్ ప్లాట్‌ఫామ్ నంబర్-2పై ఆగింది. అదే సమయంలో ఇంజిన్‌కు ఆనుకుని ఉన్న బోగీలోని బ్యాటరీ బాక్స్ దగ్గర ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. మొదట్లో ప్రయాణికులు, సిబ్బంది చిన్న సాంకేతిక లోపమే అనుకున్నప్పటికీ, క్షణాల్లోనే మంటలు చెలరేగి ఆ బోగీని పూర్తిగా చుట్టుముట్టాయి.
బోగీలో మంటలు వ్యాపించడాన్ని గమనించిన ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేస్తూ రైలు నుంచి కిందకు పరుగులు తీశారు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన రైల్వే సిబ్బంది స్టేషన్‌లో వెంటనే అత్యవసర ప్రకటనలు జారీ చేసి, ప్రయాణికులను ఖాళీ చేయించారు.
గంటన్నర పాటు ఫైర్ ఫైటర్ల శ్రమ
సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ (RPF), జీఆర్‌పీ (GRP) పోలీసులు, రైల్వే సిబ్బంది క్షణాల్లో రంగంలోకి దిగి ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు. దాదాపు గంటన్నర పాటు కష్టపడి అగ్నికీలలను అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు.
స్తంభించిన రైకపోకలు.. ప్రయాణికుల ఇబ్బందులు
ఈ ప్రమాదం కారణంగా సహర్సా-సమస్తిపూర్ రైల్వే మార్గంలో ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమైంది. సుమారు రెండు గంటల పాటు ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీనివల్ల మనిహారి-జయనగర్ జానకీ ఎక్స్‌ప్రెస్, కోసీ ఎక్స్‌ప్రెస్, దేవఘర్ ప్యాసింజర్‌తో పాటు పలు రైళ్లు మార్గమధ్యంలోనే నిలిచిపోయి ఆలస్యంగా నడిచాయి. దీంతో ఉదయాన్నే ప్రయాణాలు పెట్టుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు..




