Fire Accident: హోటల్‌లో ఎగసిపడిన మంటలు.. ఇద్దరు పిల్లలు సహా 9 మంది సజీవ దహనం
Fire Accident: ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో దాదాపు 43 మంది భక్తులు ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Fire Accident
Fire Accident: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తారాపీఠ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ఐదంతస్తుల ప్రైవేట్ హోటల్‌లో సోమవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇద్దరు పిల్లలతో సహా తొమ్మిది మంది భక్తులు సజీవదహనమయ్యారు. ఈ ఘటనతో ఆధ్యాత్మిక క్షేత్రం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా తారాపీఠ్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఒక హోటల్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో దాదాపు 43 మంది భక్తులు ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. హోటల్ ఇంటీరియర్ డిజైన్ కోసం ఫైబర్ ఆప్టిక్స్ మెటీరియల్ వాడటంతో క్షణాల్లోనే మంటలు భవనమంతటా వేగంగా విస్తరించాయి. షార్ట్ సర్క్యూట్ కాగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకటి అలముకోవడంతో లోపల ఉన్న భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అతుక్కుపోయిన ఆశలు.. మూసి ఉన్న తలుపులు
ప్రమాదం జరిగిన సమయంలో హోటల్ ఫైర్ ఎగ్జిట్ తలుపులు, భవనం పైకప్పు మార్గాలు మూసి ఉండటమే ఈ స్థాయిలో ప్రాణనష్టం జరగడానికి ప్రధాన కారణమని దర్యాప్తులో తేలింది. రిసెప్షన్ వద్ద మంట తీవ్రత ఎక్కువగా ఉండటంతో బయటకు వచ్చే మార్గం మూసుకుపోయింది. అత్యవసర ద్వారం సైతం లాక్ చేసి ఉండటంతో టాప్ ఫ్లోర్‌లో ఉన్న భక్తులు బయటకు రాలేక మంటల్లో చిక్కుకుపోయారు. ఈ భయానక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తొమ్మిది మంది ఐదవ అంతస్తులోనే ఉన్నారు.
రెస్క్యూ ఆపరేషన్.. చెరువులో గాలింపు చర్యలు
సమాచారం అందుకున్న ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది, స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 22 మందిని ప్రాణాలతో కాపాడి ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాద సమయం నుంచి కొందరు భక్తులు కనిపించకుండా పోయారు. మంటల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి కొందరు హోటల్ పక్కనే ఉన్న చెరువులోకి దూకి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో మంగళవారం ఉదయం నుంచి రంగంలోకి దిగిన ప్రత్యేక గోతాకోర్ల బృందం చెరువులో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది.
తండ్రీకొడుకుల అరెస్ట్.. దిగ్భ్రాంతిలో బాధితులు
ఈ ఘటనలో మరణించిన వారిలో మేఘాలయకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. మరో ముగ్గురు అలీపూర్ ద్వారా నుంచి వచ్చిన భక్తులు కాగా, మరో చిన్నారి కూడా ఈ దారుణానికి బలయ్యాడు. బాధితుల గుర్తింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నిర్వహించడం, అత్యవసర ద్వారాలు మూసివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, హోటల్ నిర్వహిస్తున్న తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని రాంపూర్ హాట్ కోర్టులో హాజరుపరచనున్నారు.




