Bisleri Water: బిస్లరీ వాటర్‌లో ప్రమాదకర బ్యాక్టీరియా
ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లరీకి ఫుడ్ సేఫ్టీ అధికారులు షాక్ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌లోని ప్లాంట్ నుంచి సేకరించిన నీటి నమూనాలో కోలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లు రెండు ల్యాబ్‌లు నిర్ధారించాయి.
Bisleri Water
Bisleri Water: బాటిల్ వాటర్ అంటే చాలామంది నమ్మకంతో కొనుగోలు చేస్తుంటారు. ప్రయాణాల్లో, ఆఫీసుల్లో, ఇళ్లలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ప్రముఖ వాటర్ బ్రాండ్ బిస్లరీకి సంబంధించి తాజాగా ఆందోళన కలిగించే విషయం బయటకు వచ్చింది. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) తనిఖీల్లో బిస్లరీ నీటి నమూనాలో కోలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలో ఉన్న కంపెనీ ప్లాంట్ నుంచి ఈ నమూనాను సేకరించారు. ప్రాథమిక ల్యాబ్‌లో పరీక్షించినప్పుడు నీటి నమూనా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలింది. దీంతో మరోసారి రెఫరల్ ల్యాబ్‌కు పంపగా అక్కడ కూడా బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఆ ఒక్క బ్యాచ్ అమ్మకాలపై నిషేధం
ఈ ఘటనకు సంబంధించి అధికారులు అన్ని బిస్లరీ బాటిళ్లపై నిషేధం విధించలేదు. కేవలం ఒక స్పెషల్ బ్యాచ్‌పైనే చర్యలు తీసుకున్నారు. 2026 ఆగస్టు 12న ఆ బ్యాచ్ అమ్మకాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై విచారణతో పాటు ప్రాసిక్యూషన్‌కు అనుమతి కూడా ఇచ్చారు. అంటే కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రక్రియకు అధికారులు అనుమతించారు. ఈ వ్యవహారం నవంబర్ 27న మరోసారి వార్తల్లోకి వచ్చింది. వినియోగదారులు గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ చర్య మొత్తం కంపెనీ ఉత్పత్తులపై కాకుండా నిర్దిష్ట బ్యాచ్‌పైనే వర్తిస్తుంది.
బిస్లరీ బాటిల్‌పై ఈ వివరాలు ఉన్నాయా?
వినియోగదారులు ముఖ్యంగా బ్యాచ్ నంబర్, తయారీ తేదీ వివరాలను పరిశీలించాలి. అధికారుల చర్యకు కారణమైన బిస్లరీ వాటర్ బ్యాచ్ వివరాలు ఇవి.
* బ్యాచ్ నంబర్: PB 201
* తయారీ తేదీ: 20 జూలై 2026
* గడువు తేదీ: 19 జనవరి 2027
* ప్లాంట్ ప్రాంతం: తెలీపారా గ్రామం, జల్‌పైగురి జిల్లా, పశ్చిమ బెంగాల్
* అమ్మకాలపై నిషేధం: 12 ఆగస్టు 2026
మీ దగ్గర ఈ వివరాలతో ఉన్న బాటిల్ ఉంటే దాన్ని తాగకండి. ఇప్పటికే కొనుగోలు చేసి ఉంటే వినియోగించకుండా సంబంధిత విక్రేతను లేదా ఫుడ్ సేఫ్టీ అధికారులను సంప్రదించండి. గడువు తేదీ ఉండటం మాత్రమే నీరు సురక్షితమని చెప్పడానికి సరిపోదు. బాటిల్ సీల్, బ్యాచ్ వివరాలు కూడా పరిశీలించడం అవసరం.
కోలిఫామ్ బ్యాక్టీరియా ఉంటే ఏం జరుగుతుంది?
కోలిఫామ్ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా సమూహం. నీటిలో వీటి ఉనికి కనిపిస్తే నీటి శుద్ధి ప్రక్రియలో లోపం ఉండొచ్చని లేదా నీటిలో కలుషిత పదార్థాలు చేరి ఉండొచ్చని సూచిస్తుంది. ముఖ్యంగా మురుగునీటి లీకేజీలు, దెబ్బతిన్న పైపుల ద్వారా ఇలాంటి బ్యాక్టీరియా నీటిలోకి చేరే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల కోలిఫామ్ బ్యాక్టీరియా మల కాలుష్యానికి కూడా సూచికగా ఉంటాయి. అయితే కోలిఫామ్ సమూహంలోని ప్రతి బ్యాక్టీరియా వ్యాధులకు కారణం కాదు. కలుషిత నీటిని తాగితే విరేచనాలు, కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే నీటి నాణ్యత పరీక్షలు చాలా ముఖ్యం.
గోవాలోనూ మరో కేసు
బిస్లరీకి సంబంధించి పశ్చిమ బెంగాల్ ఘటన ఒక్కటే కాదు. అంతకుముందు గోవాలోని కంపెనీ ప్లాంట్ నుంచి సేకరించిన మరో నీటి నమూనా కూడా నాణ్యతా పరీక్షల్లో విఫలమైంది. ఆ నమూనాలో నిర్ణీత పరిమితికి మించి బ్రోమేట్ ఉన్నట్లు ప్రాథమిక పరీక్షలో గుర్తించారు. కంపెనీ అప్పీల్ చేసిన తర్వాత రెఫరల్ ల్యాబ్ పరీక్షలో పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు గుర్తించి, ఆ నమూనాను అసురక్షితంగా వర్గీకరించినట్లు FSSAI తెలిపింది. అయితే గోవా ఘటనపై కంపెనీ తమ ఉత్పత్తులు సురక్షితమని, సమస్య ఒక నిర్దిష్ట బ్యాచ్‌కు సంబంధించినదని పేర్కొంటూ అధికారులతో సహకరిస్తామని తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా వివిధ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ల నమూనాలను కూడా అధికారులు సేకరించి పరీక్షిస్తున్నారు. దీంతో బాటిల్ వాటర్ నాణ్యతపై మరోసారి చర్చ మొదలైంది. వినియోగదారులు ఏ బ్రాండ్ నీటినైనా కొనుగోలు చేసేటప్పుడు తయారీ వివరాలు, సీల్, బ్యాచ్ నంబర్ తప్పనిసరిగా పరిశీలించాలి.




