Punjab: ఆరేళ్ల తర్వాత మళ్లీ కలిసిన బీజేపీ–అకాలీదళ్.. సీఎం అభ్యర్థి ఎవరంటే?

Punjab: ఆరేళ్ల తర్వాత బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మళ్లీ పొత్తు ప్రకటించాయి.

Arun Chilukuri
Published on: 24 Nov 2026 3:39 PM IST
Punjab
X

Punjab: ఆరేళ్ల తర్వాత మళ్లీ కలిసిన బీజేపీ–అకాలీదళ్.. సీఎం అభ్యర్థి ఎవరంటే?

Punjab: పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP), శిరోమణి అకాలీదళ్ (SAD) మరోసారి చేతులు కలిపాయి. వచ్చే 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. గురుపురబ్ (గురునానక్ జయంతి) సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఈ పొత్తును ఖరారు చేశారు.

ఎన్డీయే (NDA) పురాతన మిత్రపక్షమైన అకాలీదళ్ తిరిగి ఎన్డీయేలోకి రావడం ఎంతో సంతోషకరమని అమిత్ షా అన్నారు. సీట్ల పంపకాల వివరాలను ఇంకా ప్రకటించనప్పటికీ, పొత్తులో అకాలీదళ్‌దే ‘పెద్దన్న’ (Big Brother) పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. "పెద్దన్నే ముఖ్యమంత్రి అవుతారు. ఇరు పార్టీలు కలిసి మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాయి" అని అమిత్ షా పేర్కొన్నారు. 2029 డిసెంబర్ నాటికి పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని, డ్రగ్స్ సమస్యను నిర్మూలించడంలో అధికార ఆప్ (AAP), గత కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. ఈ పొత్తు దేశవ్యాప్తంగా హిందూ-సిక్కు సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

అకాలీదళ్ తిరిగి ఎన్డీయే కుటుంబంలోకి రావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. "పంజాబ్, పంజాబీ ప్రజల సంక్షేమమే ప్రథమం. శ్రీ గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ రోజున అకాలీదళ్ ఎన్డీయేలోకి రావడం ఆనందంగా ఉంది. ఇది సహజమైన పొత్తు. అటల్ జీ, అద్వానీ జీ, సర్దార్ ప్రకాశ్ సింగ్ బాదల్ జీ తీర్చిదిద్దిన ఈ బంధం కాలాన్ని తట్టుకుని నిలబడింది" అని ప్రధాని ‘ఎక్స్’ (X) వేదికగా పోస్ట్ చేశారు.

అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ.. ఇది కేవలం రాజకీయ పొత్తు మాత్రమే కాదని, పంజాబ్ మేలు కోసం ఏర్పడిన ‘భావోద్వేగ బంధం’ అని అభివర్ణించారు. తన తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్, అటల్ బిహారీ వాజ్‌పేయి కలగన్న పొత్తు మళ్లీ చిగురించడం సంతోషంగా ఉందన్నారు. పంజాబ్‌లో ‘కేజ్రీవాల్ టీమ్’ రాష్ట్రాన్ని దోచుకోవడంలో బిజీగా ఉందని, తమ కూటమి పంజాబ్‌ను కాపాడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

2027 ఎన్నికల్లో బీజేపీ సుమారు 40 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. 2020లో పొత్తు విడిపోకముందు బీజేపీ కేవలం 23 సీట్లలో, అకాలీదళ్ 94 సీట్లలో పోటీ చేసేవి.

వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా 2020 సెప్టెంబర్‌లో 24 ఏళ్ల బంధాన్ని తెంచుకుని అకాలీదళ్ ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది.

2022 అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసినప్పుడు మొత్తం 117 స్థానాల్లో బీజేపీ కేవలం 2 సీట్లు, అకాలీదళ్ 3 సీట్లకే పరిమితమయ్యాయి. ఇప్పుడు మళ్లీ కలిసి రావడంతో పంజాబ్ రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.