బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్రకు అస్వస్థత.. కోల్‌కతా ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స
MLA Rekha Patra: పశ్చిమ బెంగాల్‌లోని హింగల్‌గంజ్ బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర ఆదివారం తెల్లవారుజామున కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.
బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్రకు అస్వస్థత.. కోల్‌కతా ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స
MLA Rekha Patra Hospitalised: పశ్చిమ బెంగాల్‌లోని హింగల్‌గంజ్ బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర ఆదివారం తెల్లవారుజామున కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఉత్తర 24 పరగణాల జిల్లా హింగల్‌గంజ్‌లోని తన ఇంట్లో అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈస్టర్న్ మెట్రోపాలిటన్ బైపాస్ సమీపంలోని ఆర్ఎన్ టాగోర్ ఆసుపత్రిలో ఆమె పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందిస్తున్నారని సమాచారం.
బసిర్‌హాట్ నుంచి కోల్‌కతాకు తరలింపు
శనివారం రాత్రి ఇంట్లో ఉన్నప్పుడు రేఖా పాత్రకు ఉన్నట్టుండి ఆరోగ్యం క్షీణించింది. ముందుగా ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి మరింత సీరియస్ కావడంతో ప్రభుత్వ బసిర్‌హాట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి, క్రిటికల్ కేర్ యూనిట్‌లో ట్రీట్‌మెంట్ అందించారు. అక్కడ సుమారు నాలుగు గంటల పాటు చికిత్స చేసినా ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆదివారం తెల్లవారుజామున కోల్‌కతాలోని ఆర్ఎన్ టాగోర్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె క్రిటికల్ కండిషన్‌లోనే ఉన్నారు.
పురుగుమందు సేవించినట్లు మెడికల్ రిపోర్ట్
రేఖా పాత్ర వ్యవసాయంలో వాడే పురుగుమందును మింగినట్లు తాజా వైద్య నివేదికలో వెల్లడైంది. అయితే ఆమె ఏ పరిస్థితుల్లో దీన్ని సేవించారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. శనివారం రాత్రి ఇంట్లో ఏం జరిగిందనే విషయంపై రేఖా పాత్ర కుటుంబ సభ్యులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
సందేశ్‌ఖాలి నుంచి అసెంబ్లీ దాకా..
సుమారు మూడేళ్ల క్రితం ఉత్తర 24 పరగణాల జిల్లా సుందర్‌బన్స్ ప్రాంతంలోని సందేశ్‌ఖాలిలో రేఖా పాత్ర నేతృత్వంలో జరిగిన నిరసనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ అఘాయిత్యాలకు పాల్పడుతోందంటూ అప్పట్లో ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల్లో అదే జిల్లాలోని బసిర్‌హాట్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఆమెను బరిలోకి దించినా ఓటమి ఎదురైంది. రెండేళ్ల అనంతరం 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హింగల్‌గంజ్ నుంచి పోటీ చేసి గెలిచిన రేఖా పాత్ర, తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.




